నిధులు ఉన్నాయి....స్థలం ఉంది..... రైల్వే జోన్ మాత్రం...?

Update: 2022-08-08 15:36 GMT
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని వుంది అన్నట్లుగా విశాఖ రైల్వే జోన్ పరిస్థితి తయారైంది. విశాఖ రైల్వే జోన్ ని కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఫిబ్రవరి 1న విశాఖలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో చెప్పారు. అప్పటికి ఎన్నికలకు దగ్గరగా వాతావరణం ఉంది. దాంతో అది ప్రకటనలకే పరిమితం అయింది. కానీ ఆ తరువాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

అయినా మూడున్నరేళ్ళుగా రైల్వే జోన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. విశాఖలో రైల్వే జోన్ కి అవసరమైనన్ని ఎకరాలలో  రైల్వే స్థలాలు ఉన్నాయి. అలాగే భవనాల నిర్మాణానికి నిధులు ఉన్నాయి. ఇక రైల్వే జోన్ కోసం డీపీఆర్ ని కేంద్రం కోరింది. అది కూడా ఏనాడో పూర్తి అయి కేంద్రం వద్ద పెండింగులో ఉంది.

అయితే తాపీగా కేంద్ర రైల్వే మంత్రి మాత్రం డీపీయార్ ఆమోదం పొందిందని చెబుతున్నారు. అంతే కాదు నిధులు ఉన్నాయని అంటున్నారు. మరి రైల్వే జోన్ నిర్మాణానికి ఆలస్యం ఎందుకు అంటే మాత్రం బీజేపీ పెద్దల వద్ద జవాబు అయితే లేదు. ఇక రాజ్యసభలో వర్షాకాల సమావేశాల చివరి రోజున మాత్రం కేంద్రం క్లారిటీ అయినా ఇచ్చిందా అంటే అవును అనుకోవాలేమో

విశాఖ రైల్వే జోన్ అతీ గతీ మీద ఆయన ప్రశ్నించినపుడు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాత్రం కంగారు పడవద్దంటూ ఒక మాట చెప్పారు.

డీపీయార్ ఆమోదం పొందింది అన్నదే ప్రస్తుతానికి ఆ శుభవార్త. మరి రైల్వే జోన్ కోసం జోనల్ ఆఫీసుల నిర్మాణం ఎపుడు మొదలవుతుంది అంటే వేచి చూడాలనే కేంద్రం అంటోంది. అంతా సిద్ధమైందని చెబుతున్న  కేంద్ర పెద్దలు ఆ రోజు ఎపుడో మాత్రం చెప్పడంలేదు. ఇది మాత్రం విశాఖ సహా ఏపీ జనాలకు పూర్తి నిరాశే.

ఇక విజయసాయిరెడ్డి మరో విన్నపం కూడా చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ని విశాఖ రైల్వే జోన్ తో పాటే  ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆ విధంగా చేస్తే కనుక ఏపీ నుంచి రైల్వే ఉద్యోగాల కోసం యువత ఇక్కడే పరీక్షలు రాసేందుకు వీలు అవుతుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణాకు వెళ్లి రాయాల్సివస్తోందని ఆయన తెలిపారు. మరి కేంద్ర రైల్వే శాఖ ఏపీపైన సీత కన్ను వీడి మంచిగా ఆలోచిస్తే రైల్వే జోన్ కల సాకారం అవుతుంది, అలాగే రిక్రూట్మెంట్ బోర్డు కూడా వస్తుంది.
Tags:    

Similar News