దేశంలో కాంగ్రెస్ కు నూకలున్నాయ్.. హిమాచల్ నిదర్శనం.. ఆశల్లేని చోట అధికారం

Update: 2022-12-08 09:30 GMT
ఏడాదికో రాష్ట్రం చేజారుతోంది. దేశవ్యాప్తంగానూ పట్టు జారుతోంది. పార్టీలో గ్రూపులు పెరుగుతున్నాయి.. ప్రజల్లో పరపతి తగ్గుతోంది.. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పరాభవం ఎదురైంది. కానీ, ఆ పార్టీకి దేశంలో ఇంకా పట్టుంది. జనంలో ఆ పార్టీ పట్ల సానుకూలత ఉంది. దానిని అందిపుచ్చుకుంటే మళ్లీ వైభవం ఖాయం. ఎందుకీ మాటంటే, హిమాచల్ ప్రదేశ్ లో అధికారం దక్కనుండడమే. గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రంలో సాధ్యం కాని అధికారాన్ని హిమాచల్ లో సాధించింది. చిన్న రాష్ట్రమే అయినా, ఈ ఫలితాన్ని కాదనలేం. ఇంతకూ గుజరాత్ లో ఎందుకు పోటీ ఇవ్వలేకపోయింది..? హిమాచల్ లో ఎలా సాధించింది..? అనేది చూస్తే

దిశ లేదు దశ లేదు గుజరాత్ కాంగ్రెస్, హిమాచల్ కాంగ్రెస్ రెండూ ఒకటేనా? అంటే ఒకటే అనేంతగా ఆశ్చర్యంగా ఉన్నాయి ఫలితాలు. గుజరాత్ లో దశ, దిశ లేని వైఖరితో ఆ పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రచారానికి ఎవరు వెళ్తున్నారో..? అసలు ప్రచారం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. అదే సమయంలో స్ఫూర్తిదాయక, ఫోకస్డ్ ప్రచారంతో హిమాచల్ ను వశం చేసుకుంది. గుజరాత్ లో ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ, హిమాచల్ లో దీనికి పూర్తి భిన్నంగా సాగింది.

ఆప్ ఉన్నా ఫలితం సాధించింది..ఈ ఎన్నికల్లో గుజరాత్ లో కాంగ్రెస్ ఓట్లు 25 శాతంలోపునకు పడిపోయాయి. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాకతోనే గుజరాత్ లో కాంగ్రెస్ కు గడ్డు కాలం మొదలైందని భావించారు. అది నిజమైంది. కానీ, గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే హిమాచల్ లోనూ ఆప్ పోటీచేసింది. కానీ, అక్కడ కాంగ్రెస్ గెలవబోతోంది. అంటే, దీనర్ధం కాంగ్రెస్ నాయకులు చొరవ చూపిన చోట పార్టీ బలంగా నిలిచింది. చేతులెత్తేసిన చోట కునారిల్లిపోయింది. చిత్రమేమంటే, గుజరాత్ లో కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టిన ఆప్.. ఢిల్లీకి దగ్గరగా ఉండే హిమాచల్ లో మాత్రం బోణీ కూడా కొట్టలేకపోయింది.

ఐదేళ్ల కిందట ఊపు నేడేది? 2017 ఎన్నికల్లో గుజరాత్ లో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తించింది. అగ్ర నేత సోనియా గాంధీ, నాటి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ఎన్నికలను ప్రధాని మోదీతో వ్యక్తిగత పోటీ అన్నంత స్థాయిలో తీసుకున్నారు. నాడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ఇన్ చార్జిగా ఉన్న అశోక్ గెహ్లోత్, కాంగ్రెస్ కు మెదడు లాంటి అహ్మద్ పటేల్ ఆయనకు అండగా నిలిచారు. దీంతోనే గెలవగలం అనే ఆత్మవిశ్వాసంతో పోరాడింది. చివరకు 77 సీట్లను సాధించింది. బీజేపీని 99 సీట్లకు పరిమితం చేసింది. కానీ, ఇప్పుడు అహ్మద్ పటేల్ భౌతికంగా లేరు. గెహ్లోత్ రాజస్థాన్ సీఎంగా అక్కడి అసమ్మతితోనే సతమతం అవుతున్నారు. వీటికితోడు కాంగ్రెస్ కు సహజమైన వర్గ విభేదాలు సరేసరి. దీంతో చిత్తశుద్ధి లోపించింది. ఎన్నికల ప్రారంభ దశలోనే ‘‘కాంగ్రెస్ బీజేపీని ఢీకొట్టలేదు’’ అనే ఫీలర్ గుజరాత్ ప్రజలకు వెళ్లింది. గుజరాత్ ఎన్నికల ప్రధాన పరిశీలకుడిగా ఈసారీ గెహ్లోత్ ను నమ్ముకున్నా.. ఆయన రాజస్థాన్ వ్యవహారాలతో పెద్దగా ప్రయత్నం చేయలేకపోయారు.

జీపీసీసీ అధ్యక్షుడు నామమాత్రం గుజరాత్ కు అసలు పీసీసీ అధ్యక్షుడు ఉన్నారా.? అంటే ఉన్నారంటే ఉన్నారు. కానీ, పోరాట పటిమ లేదు.. స్ఫూర్తిదాయక నాయకత్వం కరువు..  జగ్దీష్ ఠాకూర్ జీపీపీసీ చీఫ్. వెటరన్ అయిన ఈయన ఇంకా భరత్ సింగ్ సోలంకీ ఛాయ నుంచి బయటపడలేదు. ఇక సీనియర్లు అర్జున్ మోద్వాఢియా, శక్తిసింగ్ గోహిల్, సిద్ధార్థ్ పటేల్ తమ క్తిమేర పోరాడినా, వారిమధ్య సమన్వయం కరువైంది. ఈసారీ గెహ్లోత్ కు తోడు రాజస్థాన్ మాజీ మంత్రి రఘుశర్మను ఇన్ చార్జిగా నియమించారు. వీరిద్దరూ సన్నిహితులు. కానీ, వారి మధ్యనే విభేదాలు వచ్చాయి. ఓ దశలో రఘు శర్మ నిధుల కోసం ఏఐసీసీని వేడుకోవాల్సి వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కారణాలు.

హిమాచల్ నాడిని పసిగట్టిన ప్రియాంక హిమాచల్ ప్రదేశ్ లో పార్టీకి అవకాశాలు ఉన్నాయని అగ్ర నేత ప్రియాంక గాంధీ ముందే పసిగట్టారు. పోరాడితే ఫలితం సాధించవచ్చని భావించారు. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ తో కలిసి పనిచేసి ఫలితం సాధించారు. యూపీ ఎన్నికల్లో ఈ ద్వయమే బాధ్యతలు తీసుకున్నా ఓటమి ఎదుర్కొంది. ఆ పరాభవాన్ని దిగమింగుతూ హిమాచల్ లో విజయ ఢంకా మోగించారు.
 
అంశాలను గుర్తించి..హిమాచల్ లో ఏ అంశాలను లేవనెత్తితే బీజేపీని ఇబ్బంది పెట్టవచ్చో ముందే గుర్తించారు. అలాంటివే.. పాత పింఛను పునరుద్ధరణ, నిరుద్యోగం, అగ్నివీర్ కింద సైన్యంలో నియామకాలు, ధరల పెరుగుదల. ఇక ప్రియాంక చాలా ర్యాలీల్లో పాల్గొన్నారు. భఘేల్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. టిక్కెట్ల పంపిణీలో ఎదురైన అడ్డంకులను సమర్థంగా అధిగమించారు. ఇదే సమయంలో ప్రజలను ఆకర్షించేలా లక్ష ఉద్యోగాలు, మహిళలకు రూ.లక్షన్నర ఆర్థిక లబ్ధి, పాత పింఛను పునరుద్ధరణ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లారు.

విభేదాలున్నా ప్రభావం పడనీయకుండా హిమాచల్ కాంగ్రెస్ లోనూ విభేదాలున్నాయి. అక్కడి పీసీపీ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య పీసీసీ మాజీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖును కానీ, ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రిని కానీ ఎన్నడూ ముఖతా చూడనే లేదు. వీరంతా సీఎం అభ్యర్థులే. కానీ, వీరి మధ్య విభేదాల ప్రభావాన్ని కాంగ్రెస్ ఎన్నికలపై పడనీయలేదు. అందుకే అధికారం దక్కనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News