కోమటిరెడ్డికి కన్ఫం.. మధుయాష్కీ ఔట్

Update: 2019-03-16 10:10 GMT
తెలంగాణ కాంగ్రెస్ ఈసారి వడివడిగా అడుగులు వేస్తోంది. నిన్న రాత్రి 8 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్లు, ఉద్దండులకు అందులో అవకాశం కల్పించింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై బలమైన క్యాండిడేట్లను దించింది.

తాజాగా భువనగిరి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైనట్టు సమాచారం. నిన్న రాత్రియే ఈ సీటును కోమటిరెడ్డికి ఇద్దామనుకున్నా.. భువనగిరి కావాలని మరో సీనియర్ నేత మధుయాష్కీ పట్టుబట్టడంతో వాయిదా పడింది.

మధుయాష్కీ సొంత సీటు నిజామాబాద్ . కానీ అక్కడ కేసీఆర్ కూతురు కవిత బలంగా ఉండడంతో గెలుపు అసాధ్యమని భావించి మధుయాష్కీ తనకు భువనగిరి కావాలని విన్నవించాడు. దీంతో ఆ స్థానం పెండింగ్ లో పడిపోయింది.

తాజాగా కోమటిరెడ్డి కూడా భువనగిరి కావాలని పట్టుబట్టడంతో మధుయాష్కీ వెనక్కి తగ్గినట్లు సమాచారం. కోమటిరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేత కావడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈయనవైపే మొగ్గు చూపింది.

అందుకే తాజాగా రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును కాంగ్రెస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తువల్లే ఓడిపోయానని అప్పట్లో ఆరోపించాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి ఏ మేరకు విజయం సాధిస్తాడన్నది ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News