ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రాప్తకాలజ్ఞత

Update: 2015-12-08 17:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో వరుస ఓటముల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాప్తకాలజ్ఞత పాటించింది. మొన్నటి వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికలో చేసిన పొరపాటును ఇప్పుడు పునరావృతం చేయడం లేదు. కాస్త ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థులనే బరిలోకి దించాలి. ఇక్కడ బలమైన అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్థికంగా బలమైన అభ్యర్థులనే అర్థం. లేకపోతే, నెగ్గుకు రావడం కష్టం. అధికార పార్టీ విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది. దాంతో పోటీపడి కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయగలిగితేనే అధికార పార్టీని తోసి రాజని విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అంతే తప్పితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే వరంగల్ అనుభవాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కోటీశ్వరులకు లెక్క లేదు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లను వెనకేసుకున్న వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ పది కోట్లను ఖర్చు చేయడానికి అది కూడా తాము అధికారంలోకి రావడానికి ఖర్చు చేయడానికి వెనకాడరు. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈసారి పారిశ్రామికవేత్తలు - కోటీశ్వరులను బరిలోకి దించుతోంది. నల్లగొండ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిని బరిలోకి దించింది. అలాగే పాలమూరు నుంచి దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో డాక్టర్ చంద్రశేఖర్ కు టికెట్ ఇచ్చింది.

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఎట్టకేలకు కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, మిగిలిన స్థానాల్లో కూడా ఇప్పుడు కుబేరులు తప్ప ఆ పార్టీకి దిక్క లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపునకు ఇదే మార్గమని చెబుతున్నారు.
Tags:    

Similar News