కాంగ్రెస్ ని కరుణించే రోజు దగ్గర్లోనే...?

Update: 2022-02-26 09:30 GMT
ఏపీలో గత రెండు ఎన్నికలుగా చూస్తే కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా అసెంబ్లీలో గెలుచుకోలేకపోయింది. ఇక విభజన ఏపీలో డిపాజిట్ వచ్చిన నియోజకవర్గాలూ లేవంటే కాంగ్రెస్ ఎంతలా కునారిల్లిందో అర్ధం చేసుకోవాలి. దానికి కారణం అడ్డగోలుగా ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ విభజన చేసింది అన్న జనాగ్రహమే.

ఇక 2014లో విభజన వేడి ఉండగా వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ ని జనాలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒక వైపు కాంగ్రెస్ విభజన పాపాన్ని మోస్తూంటే మరో వైపు బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా వచ్చిన నరేంద్ర మోడీ ఏపీ జనాల్లో ఆశలు రేపారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పదేళ్ల పాటు ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని, పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు ఏపీ జనాలను మైమరపింపచేశాయి.

దాంతో కాంగ్రెస్ కుదేల్ అయింది. అయితే గత అయిదేళ్లలో ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ నెరవేర్చలేదు. మరో వైపు చంద్రబాబు నాడు బీజేపీకి  మిత్రుడిగా ఉన్నా ఏపీకి సాయం అందలేదు. దాంతో పాటు 2019 నాటికి జగన్ ఆశాకిరణంగా జనాలకు కనిపించాడు. తాను కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సహా అన్నీ సాధించుకుని వస్తాను అని జగన్ చెప్పారు. అలా జగన్ వైపు ఏపీ జనం మొగ్గు చూపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటి మీద కోపాన్ని ప్రదర్శించారు. ఇలా 2019 నాటికి ఏపీలో కాంగ్రెస్ మరోసారి అలా దెబ్బ తింది.

అయితే 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ కి ఏపీలో ఆశలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అనే వాతావరణం చెబుతోంది. వరసగా రెండు ఎన్నికలలో ఘోరమైన ఓటమి పాలు అయిన కాంగ్రెస్ తన తప్పులకు మూల్యం చెల్లించుకుంది. పదేళ్ల పాటు కాంగ్రెస్ కి జనం వేసిన శిక్ష పూర్తి అయిందని, ఇక కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఇక ఏపీలో ఉన్న రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ విభజన హామీలను రాష్ట్రానికి సాధించే విషయంలో ఫెయిల్ అయ్యాయి. ఇక రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఏపీకి ఏ రకమైన సాయం చేయడంలేదు. పైగా హామీలు అలాగే ఉంచేసింది.

దీంతో 2024 ఎన్నికలలో తమ ఆయుధాలుగా విభజన హామీలనే ఏపీ కాంగ్రెస్ ఎంచుకుంటోంది. ఏపీలోని వివిధ జిల్లాలలో విస్తృతంగా పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ దీని మీద అటు కేంద్రాన్ని ఇటు వైసీపీని కూడా కలిపే విమర్శలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన నిందించారు. పోలవరం ఎపుడు పూర్తి చేస్తారు అంటూ ఆయన నిలదీస్తున్నారు.

అలగే, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్, 2014–15 ఆర్థిక సంవత్సరపు నిధుల లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు,  ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ఇలా ఏ ఒక్క హామీని రకరకాల కారణాలు చూపిస్తూ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.

తమ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధానిగా ఉంటే కచ్చితంగా ఏపీకి ఇచ్చిన ప్రతీ ఒక్క విభజన హామీనీ నెరవేరుస్తామని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ కి మాత్రమే చిత్తశుద్ధి ఉందని, పైగా తమది జాతీయ పార్టీ అని తాము తప్ప ఎవరూ ఏపీకి న్యాయం చేయలేరని అంటున్నారు.

మరి కాంగ్రెస్ మాటలు ఇపుడు జనాలకు ఎక్కుతాయా. అంటే ఏపీలో రెండు ఎన్నికల్లో కొన్ని పార్టీలను నమ్మి ఇబ్బందులు పడిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ వైపు ఎంతో కొంత చూసే అవకాశం అయితే ఉంది అంటున్నారు. మరి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కనుక బాగా పుంజుకుంటే ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడే అవకాశం తప్పకుండా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అపుడు కాంగ్రెస్ కచ్చితంగా ఏపీలో మంచి ఫలితాలు రాబట్టినా ఆశ్చర్యం అయితే లేదు అన్నది కూడా ఒక చర్చగా ఉంది.
Tags:    

Similar News