పాత బిల్లులు ఇస్తేనే కొత్త పనులు.. ఏపీ సర్కార్ కు షాకిచ్చిన కాంట్రాక్టర్లు

Update: 2021-07-31 13:30 GMT
అప్పుల ఏపీని ఇప్పుడు ఎవ్వరూ నమ్మడం లేదా? ఏపీ ప్రభుత్వం పనుల కోసం టెండర్లు వేస్తే చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదా? బిల్లులు చెల్లించని ఏపీ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు నమ్మకం పోయిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

ఇప్పటికే అప్పుల ఊబిలో ఏపీ ప్రభుత్వం కూరుకుపోయింది. ప్రతినెల అప్పుల కోసం రుణ సంస్థల వైపు చూస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సహా ప్రభుత్వం ప్రతి నెల నడిచేందుకు కూడా అప్పులు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతినెల ఆర్బీఐ నుంచి వీటి కోసం అప్పులు చేస్తోంది. బాండ్లు జారీ చేసి కొత్త రుణాలు తీసుకుంటోంది. ఇంతటి కరువు కాలంలో రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు తాజాగా ఏపీ ప్రభుత్వం టెండర్లు వేస్తే స్పందన కరువైంది. పాత బిల్లులే చెల్లించని ఏపీ ప్రభుత్వం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.

రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు.

ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే చిన్నా పెద్దా కలిపి సుమారు 100 మంది కాంట్రాక్టర్లకు రూ.40-50 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లులు ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో సీఎఫ్ఎంఎస్ లో బిల్లులు అప్ లోడ్ చేసుకునే అవకాశమైనా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో బిల్లులు కనీసం అప్ లోడ్ కావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఆర్థికంగా చితికి పోతున్న తమకు కనీసం బ్యాంకుల నుంచి అయినా అప్పు ఇప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న దుస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో జాతీయ రహదారుల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు మొగ్గుచూపుతున్నారు... అవి కేంద్రం నిధులు ఠంచనుగా విడుదల చేస్తుండడంతో వాటికే ఎగబడుతున్నారు. కానీ రాష్ట్ర, జిల్లా రోడ్ల పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. బిడ్లు కూడా దాఖలు చేయని పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో 8970 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లను రూ.2205 కోట్లతో పునరుద్దరించేందుకు ప్రభుత్వం సిద్దం కాగా.. మూడు సార్లు టెండర్లు పిలిస్తే మూడో వంతు పనులకే బిడ్లు దాఖలయ్యాయి. పాత బిల్లులు ఇస్తేనే బిడ్లు వేస్తామని పలువురు కాంట్రాక్టులు తెగేసి చెబుతున్న పరిస్థితి నెలకొంది.

బిల్లులు పెండింగ్ లో ఉండడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర, జిల్లా రహదారుల మర్మమతులు, ప్యాచ్ వర్క్ చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న పెండింగ్ బిల్లులతోనే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు కొత్తగా పనులు చేసేంత ఆర్థిక వనరులు లేవని.. అందుకే దూరంగా ఉంటున్నామని కాంట్రాకర్లు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకపోవడం.. జీతాలకే వెళ్లకపోవడంతో ఇక బిల్స్ అన్నీ పెండింగ్ లో పడిపోయాయి. అందుకే ఈ పాత బిల్లులు క్లియర్ చేయలేక ఆపసోపాలు పడుతోంది. దీంతో కొత్త పనులు చేపట్టేందుకు ఏ కాంట్రాక్టర్ కూడా ఏపీలో ముందుకు రాని పరిస్థితి నెలకొంది.


Tags:    

Similar News