దేశంలో కొనసాగుతున్న కరోనా కలకలం.. కొత్త కేసులు ఎన్నంటే

Update: 2021-08-05 05:58 GMT
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,12,114 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,11,076 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,09,74,748 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే నిన్న 533 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,26,290కి చేరింది. అటు బుధవారం 41,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.37 శాతంగా ఉంది. మరోవైపు నిన్న ఒక్క రోజులో 37,55,115 మందికి టీకా వేయగా.. ఇప్పటిదాకా 48,93,42,295 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు 51.01 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఇప్పటిదాకా పంపిణీ అయిన, వృధా అయిన టీకాల మొత్తం 48,60,15,232గా ఉందని వెల్లడించింది.

కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న 22,414 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో 6126 మంది కరోనా బారినపడ్డారు. బుధవారం దేశవ్యాప్తంగా 16,64,030 మందికి కరోనా పరీక్షలు చేశారు. 37,55,115 డోసుల వ్యాక్సిన్ వేశారు. మన దేశంలో ఇప్పటి వరకు 48,93,42,295 డోసుల టీకాలు వేశారు.


Tags:    

Similar News