షాంఘై లో కరోనా కలకలం.. చనిపోయే వారికి చెప్పే లెక్కకు లింకే ఉండట్లేదట!

Update: 2022-04-25 09:30 GMT
కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కరోనా విస్తరిస్తోంది. ఈ మహమ్మారికి చెక్ పెట్టేలా 'జీరో కొవిడ్' పాలసీని చైనా అమలు చేస్తున్నా.. కరోనాను కంట్రోల్ చేయటం వారి తరం కావట్లేదు. దీంతో.. కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విరుచుకుపడటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా కరోనా కేసులు చైనాలోని పెద్ద నగరాల్లో ఒకటైన షాంఘైలో ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు. దీంతో.. చైనా ఆర్థిక నగరం ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. అధికారికంగా చెప్పే లెక్కలకు.. వాస్తవానికి పొంతన లేదంటున్నారు.

కేసుల నమోదు మాత్రమే కాదు.. మరణాలు కూడా భారీగా ఉన్నాయని చెబుతున్నారు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలకు సంబంధించి అధికారిక ప్రకటనల పేరుతో అబద్ధాల్ని ఎలా అయితే చెబుతారో షాంఘైలో కూడా ఇప్పుడు అదే జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. చైనాలోని కొత్త ప్రాంతాల్లోనూ కరోనా కేసులు నమోదు కావటం ఇప్పుడు డ్రాగన్ దేశానికో తలనొప్పిగా మారింది.అధికారిక లెక్కల ప్రకారం ఒక్క శనివారం రోజున షాంఘైలో 21,796 కేసులు నమోదైతే.. 39 మంది మరణించినట్లుగా చెబుతున్నారు. అయితే.. వాస్తవం మాత్రం ఇంతకు మించే ఉందని చెబుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత చైనాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి పరిచయమైన లాక్ డౌన్ కు.. చైనాలో అమలు చేసే దానికి ఏ మాత్రం పోలిక ఉండదన్న సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ వేళ చివరకు ఇంట్లో ఉన్న దంపతులు సైతం సానిహిత్యంతో ఉండకుండా నిబంధనల్ని పెట్టటమేకాదు.. అలా జరుగుతుందా? లేదా? అన్నది చెక్ చేసేందుకు డ్రోన్ వ్యవస్థను వినియోగించిన తీరు చూసినప్పుడు.. మన లాక్ డౌన్ కోటి రెట్లు మెరుగైనదన్న మాట వినిపించింది.

అధికారిక లెక్కల ప్రకారం 2019 డిసెంబరులో వూహాన్ లో మొదటిసారి కరోనాను చూసిన నాటి నుంచి ఇప్పటివరకు చైనాలో చోటు చేసుకున్న మరనాలు కేవలం 4725గా చెబుతున్నారు. కానీ.. వాస్తవం అంతకు పది రెట్లకు మించి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. వాస్తవాల్ని సీల్ చేసేసి.. తనకు నచ్చిన.. తోచిన వివరాల్ని మాత్రమే బయటకు వెల్లడించే టాలెంట్ చైనా సొంతంగా చెబుతారు. అలాంటి దేశంలో గడిచిన రెండున్నరేళ్లలో కరోనా మరణాలు కేవలం ఐదు వేల లోపు మాత్రమే అంటే నమ్మక తప్పుతుందా?

ఇక.. షాంఘైలో అమలు చేస్తున్న జీరో కొవిడ్ పాలసీతో  ఆ మహానగర ప్రజలు ఆకలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా కేసుల ప్రమాద తీవ్రతను మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలోని వారు కఠినమైన కొవిడ్ ఆంక్షల్ని ఎదుర్కోవాల్సిందే. రెండో వర్గం మారు ఒక మోస్తరు ఆంక్షల్ని.. మూడో వర్గం వారికి ఎలాంటి ఆంక్షలు ఉండవు. వీరు బయట తిరిగే వీలుంది. లాక్ డౌన్ కారణంగా.. చైనీయులు తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆకలితో నకనకలాడుతూ.. తమకు తినేందుకు కాసింత ఆహారాన్ని పంపాల్సిందిగా వేడుకుంటున్నారు. గొప్పలు చెప్పే చైనా సర్కారు.. కష్టంలో ఉన్న వేళలో తమ ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితిలో ఉంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉంటుంది చెప్పండి?
Tags:    

Similar News