కరోనా టెన్షన్.. వైద్యులు ఏమంటున్నారంటే?

Update: 2021-05-02 00:30 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఏడాది నుంచి విజృంభిస్తున్న మహమ్మారి గత నెల నుంచి జడలు చాస్తోంది. భారత్ రెండో దశ కేసులు, మరణాలను చూసి ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా మరణాల్లో ఎక్కువ మంది మానసికంగా కుంగుబాటుకు లోనై ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు తెలిపారు. వైరస్ పట్ల ఎలాంటి భయబ్రాంతులకు గురి కావొద్దని సూచిస్తున్నారు. కరోనాపై కలవర పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

కరోనా పాజిటివ్ అని తేలగానే కొందరు భయపడుతూ మానసికంగా దెబ్బతింటున్నారని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ పూర్వ ప్రిన్సిపల్‌, విశాఖపట్నం మానసిక వైద్యశాల రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భాగ్యారావు తెలిపారు. వారికి వైద్యం ఇచ్చినా కోలుకోవడం లేదని అన్నారు. వైరస్ సోకినంత మాత్రానా మరణించరు అని ధైర్యం చెప్పారు. ఇలాంటి వారికి మానసిక చికిత్స అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వారికి 104 ద్వారా చికిత్స అందించడానికి ఏపీ ప్రభుత్వం సైకాలజిస్టులను సంప్రదించిందని తెలిపారు. త్వరలో ఈ సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

కరోనా సోకిందనగానే ఇక తాము బతకడం కష్టమనే భావనలో ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. నిజానికి ప్రాణంతక వ్యాధులతో మృతి చెందుతున్న వారికన్నా కరోనాతో మరణించే వారి సంఖ్య చాలా తక్కువ అని తెలిపారు. క్యాన్సర్ బాధితులు 50 శాతం, మెనెంజైటిస్‌ తో 10 శాతం ప్రాణాలు కోల్పోతారు. కానీ కొవిడ్ తో మృతి చెందేవారు కేవలం ఒక్కశాతం మాత్రమేనని వెల్లడించారు. బెడ్ల అందుబాటు, ఆక్సిజన్ గురించి ఆలోచన వద్దని సూచించారు. అవి చాలా తక్కువ మందికి మాత్రమే అవసరమవుతాని చెప్పారు. బాధితులందరికీ ఐసీయూలో చికిత్స అవసరం లేదని అన్నారు.

కరోనా మనిషిపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దగ్గు, జలులు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరితిత్తులపై ప్రభావం వంటి సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. కరోనా పట్ల ఉన్న భయం మాత్రం పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు. అలాంటి వారికి చికిత్స అందించినా ఫలితం ఉండదని చెప్పారు. కాబట్టి వార్తల్లో వచ్చే వాటిని విని భయబ్రాంతులకు గురి కావొద్దని సూచించారు. మీడియా సానుకూల వార్తలనే ప్రసారం చేయాలని కోరారు. మానసిక ధైర్యంతో ఇంట్లోనే మహమ్మారిని ఎదుర్కొవచ్చని ఆయన సూచించారు. 
Tags:    

Similar News