శుభ‌సూచ‌కం: తెలంగాణ‌లో క‌రోనా ఫ్రీగా 11 జిల్లాలు

Update: 2020-04-30 06:45 GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. క‌రోనా ర‌హిత రాష్ట్రంగా ఆవిర్భ‌వించే అవ‌కాశం ఉంది. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు సత్ఫ‌లితాలు ఇస్తున్నట్లు ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ‌లో వారం రోజులుగా ప‌దిలోపు కేసులు న‌మోద‌వుతుండ‌డ‌మే నిద‌ర్శ‌నం. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ప్ర‌క‌టించిన కంటైన్‌ మెంట్ జోన్లు - రెడ్ జోన్లు క్ర‌మంగా ఎత్తివేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఒక్క క‌రోనా కేసు కూడా వారం రోజులుగా న‌మోదు కావ‌డం లేదు. కేవ‌లం హైద‌రాబాద్ ప‌రిధిలోనే కొత్త‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాలు కరోనా రహితంగా ఉన్నాయ‌ని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలోని వనపర్తి - వరంగల్ రూరల్ - యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నారాయ‌ణ‌పేట‌ - సిద్దిపేట - మహబూబ్‌ నగర్ - మంచిర్యాల - పెద్దపల్లి - భద్రాద్రి కొత్తగూడెం - నాగర్‌ కర్నూలు - ములుగు జిల్లాల్లో కొన్ని కేసులు మాత్ర‌మే న‌మోదై ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆ జిల్లాలో వరుస‌గా కేసులు నమోదు కావడం లేదు. ఈ జిల్లాల్లో గ‌తంలో కరోనా బారిన ప‌డిన వారందరూ ఆస్ప‌త్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో ఇళ్ల‌కు చేరారు.

తాజాగా బుధవారం రాష్ట్రంలో కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ కేసుల‌న్నీ హైద‌రాబాద్ న‌గ‌ర పరిధిలోనే వెలుగుచూశాయి. అయితే రాష్ట్రంలో క్రమక్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్ర‌భుత్వం చెబుతోంది. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ఫ‌లిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనా సోకిన ప్రాంతాల‌ను కంటైన్‌ మెంట్ కేంద్రాలుగా ప్ర‌క‌టించి అక్క‌డ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇత‌రుల‌కు సోక‌కుండా క‌రోనా చెయిన్‌ ను తెంపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన లాక్‌ డౌన్ మే 3వ తేదీతో ముగియ‌నుంది. ఆలోపు రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి కావాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుక‌నుగుణంగా ప‌క్కాగా అధికార యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటూ కొంత ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌స్తున్నారు.
Tags:    

Similar News