పట్టాలెక్కున్న రైళ్లు.. అంతకు మించి మరో ఛాన్సు లేదా?

Update: 2020-05-01 04:30 GMT
కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవటం పాత ముచ్చట. ఇప్పటికే రెండు దఫాలు లాక్ డౌన్ ను పొడిగించగా.. మరోమారు తప్పదన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన సస్పెన్స్ ఒకట్రెండు రోజుల్లో తీరనుంది. లాక్ డౌన్ విదించే నాటికి దేశవ్యాప్తంగా వలసకూలీలతో పాటు.. ఇతరత్రా కారణాలతో ఊరు కాని ఊళ్లో ఇరుక్కుపోయిన వారి సంఖ్య కోట్లల్లోనే ఉంది. వలసకూలీలు..

కార్మికులసంఖ్యే రెండు కోట్ల మేర ఉంటుందన్నది అంచనా. ఆకలితో పాటు.. రోజుల తరబడి బయట ప్రాంతాల్లో ఉండటం మహా కష్టంగా మారటంతో పాటు.. ఉపాధి పనులు ఏమీ లేకుండా కాలం గడపటం కఠినంగా మారింది. ఇలాంటి వేళలో.. బయట ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా కేంద్రం అనుమతులు ఇవ్వటం తెలిసిందే.

లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తే సరిపోదు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని వారి స్వస్థలాకు చేర్చేదెలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బస్సుల్ని ఏర్పాటు చేసి తరలించాలన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదంతా ఈజీ కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దీనికి బదులుగా పెద్ద ఎత్తున వలసకూలీల కోసం.. కార్మికుల కోసం రైళ్లను నడపాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున తెర మీదకు వస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయానికే వస్తే.. దూర ప్రాంతాలకు చెందిన వారు తమ స్వస్థలాకు చేరుకోవాలంటే బస్సులో మూడు.. నాలుగు రోజులు ప్రయాణించాల్సి ఉంటుందని.. అది కష్టసాధ్యమైనదిగా అభివర్ణిస్తున్నారు.

ఈ క్రమంలో నాన్ స్టాప్ రైళ్లలే సమస్యకు పరిష్కారంగా చెబుతున్నారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశాయి. పంజాబ్.. కేరళతో పాటు తెలంగాణ రాష్ట్రాలు కార్మికులు.. కూలీలు.. ఇతరులు వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లటానికి వీలుగా వలస రైళ్లను ప్రత్యేకంగా నడపాల్సిన అవసరం ఉందంటున్నారు. అదే జరిగితే.. కోట్లాది మందిని తరలించటం తేలిగ్గా మారుతుందంటున్నారు.

పంజాబ్ లోని ఒక్క లూధియానాలోనే దాదాపు ఏడు లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని. పంజాబ్ మొత్తంగా పది లక్షల మంది ఉన్న విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ప్రధానికి లేఖ రాసిన ఆయన.. తమ రాష్ట్రంలో ఉన్న కార్మికుల్లో 70 శాతం మంది బిహారీలేనని.. వారందరికి పరీక్షలు నిర్వహించి.. సరైన సమయంలో తరలించాలంటే రైళ్లను నడపక తప్పదంటున్నారు. రైళ్లను నడిపే క్రమంలో పాయింట్ టు పాయింట్ మోడల్ లో నడపాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.

దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది చిక్కుకుపోయిన క్రమంలో వారిని వారి స్వస్థలాలకు చేర్చటం బస్సుల్లో కష్టమని.. ఎండలు మండుతున్న వేళ.. కొత్త ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి.. పెద్ద ఎత్తున రైళ్లను నడపటం ద్వారా వలసకూలీలు.. కార్మికులు.. ఇతరుల్ని వారి వారి సొంత ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి?
Tags:    

Similar News