తెలంగాణలో లింకులు దొరకని కరోనా కేసులు అన్ని ఉన్నాయా?

Update: 2020-05-02 05:30 GMT
పరిస్థితి అంతా అదుపులో ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భరోసా మాటలు తెలంగాణ ప్రభుత్వం నుంచి తరచూ వినిపిస్తూ ఉంటాయి. కరోనా వేళలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల్ని ప్రభుత్వం తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. మరింత బాగా పరిస్థితులు ఉన్నవేళలో అనవసరమైన ఆందోళనలు ఎందుకన్న మాట కొందరి నోట వినిపిస్తున్నా.. వాస్తవాల్ని దగ్గర చూస్తున్న వారికి మాత్రం టెన్షన్ తీరటం లేదు. తెలంగాణలో కేసుల తీవ్రత తగ్గిందని.. డబుల్ డిజిట్ లో వచ్చే పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ లోకి మారటం తెలిసిందే.

అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ లో ఇప్పటి వరకూ వెలుగు చూసిన పాజిటివ్ కేసుల్లో 22 కేసులకు సంబంధించిన మూలం ఏమిటో ఇప్పటికి వెల్లడి కాకపోవటమే. ఇప్పటి వరకూ వెలుగు చూసిన పాజిటివ్ కేసుల్లో మొదటివి విదేశాల నుంచి వచ్చిన వారు.. వారితో కాంటాక్టు కారణంగా నమోదైన కేసులు.. రెండో రకం మర్కజ్ వెళ్లి వచ్చిన వారు.. వారి ద్వారా కాంటాక్టు అయిన కేసులు.. మూడో రకం విదేశాల నుంచి వచ్చిన వారు మర్కజ్ నుంచి వెళ్లి వచ్చిన వారి ద్వారా కాంటాక్టు అయిన వారి పుణ్యంగా వెలుగు చూసిన కేసులు. ఈ మూడు రకాలు కాకుండా.. ఎంతకూ అంతుచిక్కని రీతిలో ఉన్న కేసులు.

నిజానికి లింకులు దొరకని కేసులే అత్యంత ప్రమాదకరమన్నది మర్చిపోకూడదు. ఇలాంటి కేసులు తెలంగాణ వ్యాప్తంగా 22 చోటు చేసుకోవటం.. వాటి మూలాల్ని ఛేదించే విషయంలో అధికారులు కిందామీదా పడుతున్నా.. ఫలితం మాత్రం రాని దుస్థితి. ఇలాంటి అంతుచిక్కని కేసుల కారణంగా రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఈ తరహా కేసుల్లో మూలాలు దొరకపోవటానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే తప్పించి మరొకటి లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. లింకు దొరికితే తప్పించి ఊరట లభించదన్న మాట పలువురి నోట విన్నప్పుడు మాత్రం టెన్షన్ మరింత పెరగకమానదు.
Tags:    

Similar News