మరో మూడు రోజులు ఆగితే హైదరాబాద్ ఎలా ఉంటుందో?

Update: 2020-04-17 02:30 GMT
ఎలాంటి హైదరాబాద్ ఎలా మారిపోయింది? కొన్ని దశాబ్దాలుగా నిద్రను మరిచిన నగరం ఇప్పుడు పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా విశ్రమిస్తోంది. విశాలమైన రోడ్లు బోసిపోతుంటే.. విపరీతమైన రద్దీతో ఉండే దిల్ సుఖ్ నగర్.. కుకట్ పల్లి.. అమీర్ పేట.. ఐటీ కారిడార్.. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ పరిధిలో ఎన్నో ప్రాంతాలు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. కరోనా పుణ్యమా అని.. హైదరాబాద్ మహానగరాన్ని ఇలా కూడా చూసి రావాల్సి వస్తోందని బోరుమనేవారు లేకపోలేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు లాంటి రద్దీ ప్రాంతంలో రోడ్డు మీదకు నెమలి నడుచుకుంటూ వచ్చిందంటే.. నగరం ఎలా మారిందో ఇట్టే అర్థమైపోతుంది.

అంతేనా.. లాక్ డౌన్ వేళ హైదరాబాద్ మహా నగరంలో రాత్రిళ్లు రోడ్ల మీదకు టూవీలర్ మీద బయటకు రావటం అంటే పెద్ద సాహసం కిందనే లెక్క. మీరనుకున్నట్లు పోలీసుల కారణంతో కాదు.. వీధి కుక్కల దెబ్బకు వణికిపోవాల్సిందే. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా లైట్ల కాంతులతో.. జనసంచారంతో ఉండే వీధులు వారాల తరబడి నిర్మానుష్యంగా మారిపోవటంతో రోడ్లున్ని కుక్కల మయంగా మారింది. లాక్ డౌన్ ప్రభావం ఆ మూగ జీవాల మీదా పడింది. వాటికి సరైన ఆహారం లేకపోవటంతో తీవ్రమైన అసహనంతోనూ.. ఆవేశంగానూ కనిపిస్తున్నాయి. అత్యవసర సేవల కోసం రాత్రిళ్లు టూ వీలర్ మీద వెళ్లే వారంతా హడలిపోతున్నరు. పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న దుస్థితి.

ఇలా చెప్పుకుంటూ పోతే లాక్ డౌన్ మహానగర స్వరూపాన్ని మార్చేసింది. కొన్ని ప్రైమ్ ప్రాంతాల్లో రాత్రిళ్లు వెళుతున్నప్పుడు హడలిపోవాల్సిందే. ఎందుకంటే.. మహానగరంలో మనం ఒంటరివాళ్లమన్న భావన కలగక మానదు. ఇలాంటి పరిస్థితి మరో మూడు రోజులే ఉండనుంది. ఏప్రిల్ 20 నుంచి కేంద్ర మార్గదర్శకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే మారనున్నాయి. ఐటీ కంపెనీలు యాభై శాతం ఉద్యోగులను కంపెనీలకు వచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

ఇదే కాకుండా ఈ కామర్స్ కార్యకలాపాలు షురూ కావటంతో.. నగర ప్రజలకు అవసరమైన వస్తువుల్ని ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీటి డెలివరీల కోసం పెద్ద ఎత్తున వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఎలక్ట్రిషియన్లు.. ఫ్లంబర్లతో పాటు ఇతర చేతి పనుల వారు.. భవన నిర్మాణ కార్మికులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు రంగాలకు చెందిన వారు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సీన్ మారటంతో పాటు.. నగర వీధులు కాస్తో కూస్తో రద్దీ కావటం ఖాయమని చెప్పక తప్పదు. గడిచిన కొద్ది రోజులుగా బోసిపోయిన నగరం కొత్త కళను సంతరించుకునే వీలుంది.
Tags:    

Similar News