షాక్: కరోనాతో హైదరాబాద్ రోడ్డు మీద చనిపోయాడు?

Update: 2020-04-11 04:00 GMT
షాకింగ్ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నేపాల్ కు చెందిన ఒక పెద్ద వయస్కుడు ఒకరు హైదరాబాద్ మహానగరంలోని రోడ్డు మీద మరణించటం ఒక ఎత్తు అయితే.. ఆ వ్యక్తికి కరోనా సోకిన విషయం షాకింగ్ గా మారింది. డెబ్భై ఏళ్లున్న ఈ నేపాలీ కొన్నేళ్లుగా నగరంలోని ఒక బార్ లో పని చేస్తుంటాడు. గడిచిన కొద్ది రోజులుగా దగ్గు.. జలుబు తో బాధ పడుతున్నాడు.

శుక్రవారం అతడు లాలాపేట లోని ఆసుపత్రికి వెళ్లాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు..అతడికి కరోనా లక్షణాల్ని గుర్తించారు. వెంటనే అంబులెన్స్ లో గాంధీకి తరలించారు. అయితే.. అక్కడ రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో సదరు వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదు. చివరకు వైద్యులు అతడ్ని పరీక్షించి.. తమ వద్ద రద్దీ ఎక్కువగా ఉందని.. కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిందిగా చెప్పి పంపారు.

అక్కడకు వెళ్లిన అతడికి.. అంత పెద్ద వయస్కులకు తాము వైద్యం చేయలేమని.. గాంధీకే వెళ్లాలని చెప్పారు. అప్పటికే వైద్యం కోసం తిరుగుతున్న ఆయన.. అంబులెన్స్ కోసం నిరీక్షించసాగారు. మూడు గంటల పాటు కింగ్ కోఠి ఆసుపత్రిలో ఉన్నా అంబులెన్స్ జాడ లేకపోవటంతో.. కింగ్ కోఠి నుంచి గాంధీ ఆసుపత్రికి నడుస్తూ వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణగూడ శాంతి థియేటర్ వద్దకు వచ్చిన అతను ఒక్కసారిగా కూలిపోయాడు.

కరోనా మరణంగా చెబుతున్న ఆయన డెడ్ బాడీ శుక్రవారం అర్థరాత్రి దాటే వరకూ రోడ్డు మీదే ఉండిపోవటం గమనార్హం. రాత్రి పది గంటల వేళలో ఆయన మరణించినట్లు చెబుతున్నారు. ప్రమాదకర వైరస్ తో బాధపడుతున్న వ్యక్తి వైద్యం కోసం వస్తే.. ఇలా తిప్పటమా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరో ఉదంతంలోనూ ఒక కార్పరేట్ ఆసుపత్రికి వచ్చిన పెద్ద వయస్కురాలికి కరోనా పాజిటివ్ గా తేల్చారు. మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా.. అక్కడ ఆడ్మిట్ చేసుకోవటంలో ఆలస్యమైందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ప్రాణాల్ని విడిచినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తమ ఆసుపత్రి వద్దకు వచ్చేసరికే.. ప్రాణాలు కోల్పోయినట్లుగా గాంధీ వైద్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. ఒకేరోజు ఇద్దరు కరోనా పేషెంట్లు ప్రాణాలు విడవటం.. అది కూడా వైద్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ కావటం గమనార్హం.
Tags:    

Similar News