హైదరాబాద్ కిడ్నీ రాకెట్ లోతు రష్యాను తాకుతోందా?
హైదరాబాద్ లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్నితవ్వే కొద్దీ షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్ లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్నితవ్వే కొద్దీ షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తొమ్మిది పడకలున్న ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి సర్జరీ చేసేంత ఆపరేషన్ థియేటర్ లేని వేళ.. ఈ సర్జరీలకు వేదికగా మారిన ఆసుపత్రులు ఎక్కడ? అవేంటి? అన్నది ప్రశ్నగా మారింది. కిడ్నీ సర్జరీలకు సెటప్ భారీగా ఉంటుందని.. అందుకు తగ్గ ఏర్పాట్లు ఏవీ అలకనంద ఆసుపత్రిలో లేవని చెబుతున్నారు. దీంతో సర్జరీ ఒక చోట.. వారు కోలుకునేంతవరకు అలకనంద ఆసుపత్రిలో ఉంచుతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే అలకనంద కిడ్నీ రాకెట్ లో రష్యా.. ఉక్రెయిన్ తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమంత్ రష్యాలో ఎంబీబీఎస్ చేయటం.. అక్కడ యరాలజిస్టులతో తనకున్న సంబంధాలతో.. వారిని ఇక్కడకు పిలిపించి మూత్రపిండాల మార్పిడి సర్జరీలు చేయిస్తున్నట్లుగా తెలిసింది. అలకనంద వెబ్ సైట్ లో డాక్టర్ సుమంత్ తో పాటు.. ముగ్గురు విదేశీ వైద్యులను ‘హెడ్ ఆఫ్ అలకనంద ఆస్పత్రి’గా పేర్కొన్నారు.
వెబ్ సైట్ లో పేర్కొన్న ముగ్గురు విదేశీ వైద్యులు నిజంగానే ఆసుపత్రిలో భాగస్వాములా? లేదంటే సుమంత్ ఆ ఫోటోలను వాడుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ వారు నిజంగానే ఆసుపత్రి భాగస్వామ్యులైతే.. భారత్ లో సర్జరీలు చేసతునారా? అందుకు ఎంసీఐ లైసెన్సు తీసుకున్నారా? లాంటి ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం నల్గొండ కేంద్రంగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లోనూ.. దాతలు.. స్వీకర్తలనుతమిళనాడు.. కర్ణాటక మీదుగా శ్రీలంకకు తరలించి.. అక్కడ మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ విదేశీ లింకులు ఉన్నాయన్న అనుమానాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వ్యక్తం చేస్తోంది.
ఇదంతా ఒక ఎత్తుఅయితే.. అసలీ సర్జరీలు ఎక్కడ జరిగి ఉంటాయి?అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకుంటే.. అలకనంద ఆసుపత్రి లాంటి చిన్న ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి అవసరమైనంత టెక్నాలజీతో పాటు వసతులు ఉండవు. దీనికి తోడు.. ఈ సర్జరీకి వివిధ విభాగాలకు చెందిన వైద్యుల అవసరం ఉంటుంది. కానీ.. అలాంటి వసతులు అక్కడేమీ లేని నేపథ్యంలో.. సర్జరీలు ఎక్కడ జరిగి ఉంటాయన్నది తేలితే.. ఈ వ్యవహారం మరో మలుపు తిరుగుతుందని చెబుతున్నారు,