ముంబైలోని బైకులా జైలు సిబ్బందిపై ప్రవర్తనపై ఇంద్రాణి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రేక్ ఫాస్ట్ పెట్టడంలో నిర్లక్ష్యాన్ని నిరసించినందుకు జైలు సిబ్బంది కొట్టడంతో మంజుల షెత్యే (45) అనే ఖైదీ మృతిచెందడం, దీన్ని నిరసిస్తూ సహచర ఖైదీలతో కలిసి ఇంద్రాణి ఆందోళన చేయడం...దీంతో ఆమెపైనా దాడిచేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ తన లాయర్ ద్వారా సీబీఐ కోర్టులో ఇంద్రాణి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇంద్రాణి తన వాదనాలు వినిపించారు.
జైలు సిబ్బంది కొట్టడంతోనే మంజు(45) అనే ఖైదీ మృతిచెందారని ఇంద్రాణి చెప్పారు. ఆమె చేతులు, కాళ్లు, తలపై గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక సిబ్బంది నోటికొచ్చినట్లు తిట్టారని, లైంగిక దాడికి వెనుకాడబోమంటూ బెదిరించారని వివరించారు. తమ పక్క సెల్ లోనే ఉండే మంజుల గొంతుకు దుప్పట్టా బిగించి సూపరిండెంట్ అధికారిణి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లిందని, ఈ దృశ్యాన్ని తాను, తన సహచర ఖైదీలం తలుపు రంధ్రంలోంచి చూశామని ఇంద్రాణి తెలిపింది. అయితే ఈ విషయం తెలిసిన జైలు సిబ్బంది తమను సైతం బెదిరించారని తెలిపారు. మంజు మృతిలో ఎవరెవరి ప్రవేయం ఉందనే దానిపై వివరణ ఇవ్వడానికి ఖైదీలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కోర్టులో పిటిషన్ దాఖలు ఇంద్రాణి తరఫు న్యాయవాది గుంజన్ మంగ్ల మాట్లాడుతూ జైలు సిబ్బంది దురుసు ప్రవర్తన గురించి ఇంద్రాణి సహ తోటీ ఖైదీలంతా భయంతో వణికిపోయారని అన్నారు. దీనిని నిరసిస్తూ ఇంద్రాణితోపాటు పలువురు ఆందోళన చేపట్టారని, ఈ సందర్భంగా జైలు సిబ్బంది ఇంద్రాణిపై దాడి చేశారని తెలిపారు. తనపై జరిగిన దాడిని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని, పిటిషన్ దాఖలు చేయాలని ఇంద్రాణి కోరినట్లు తెలిపారు. అందుకే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/