తిరుమల వేద పాఠశాలలో భారీగా కరోనా కేసులు

Update: 2021-03-11 05:45 GMT
తక్కువగా కేసులు నమోదవుతున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయా? కొద్ది నెలలుగా కరోనా జాడలు పెద్దగా కనిపించని పరిస్థితి. ఒక దశలో రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదైన ఏపీలో.. వందకు పడిపోయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తిరుమలలోని వేద పాఠశాలలో నమోదైన కరోనా కేసులు లెక్క తెలిస్తే అప్రయత్నంగా వణుకు రావటం ఖాయమని చెప్పాలి. కరోనా నేపథ్యంలో దీర్ఘ కాలం వేద పాఠశాలను మూసి ఉంచారు.

గత నెలలోనే ఈ స్కూల్ ను ప్రారంభించారు. తాజాగా ఈ పాఠశాలలోని 450 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. వీరిలో 57 మందికి కరోనా సోకినట్లుగా తేలింది. అంటే.. 12 శాతం మందిలో కరోనా ఉన్నట్లుగా తేలింది. దీంతో.. విద్యార్థుల్ని స్విమ్స్ కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుపుతున్నారు. పాజిటివ్ గా తేలిన విద్యార్థుల్లో కొందరికి కరోనా లక్షణాలు లేకపోవటం గమనార్హం.

అయినప్పటికి ముందు జాగ్రత్తగా వారిని ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉంచారు. ఇదిలా ఉండగా.. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో 45వేలకు పైగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించగా.. 118 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య రోజుకు డబుల్ డిజిట్ కూడా దాటలేదు. అయితే.. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.అయితే.. మరణాల విషయంలో మాత్రం కంట్రోల్ అయినట్లుగా చెబుతున్నారు. తిరుమల వేద పాఠశాల ఎపిసోడ్ తో అధికారులు అలెర్టు అవుతున్నారు. మరికొన్ని.. స్కూళ్లలో రాండమ్ గా పరీక్షలు జరపటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News