ఏపీ, తెలంగాణ‌లో ఆ రెండు పార్టీలు దుకాణం బందేనా..!

Update: 2019-10-09 01:30 GMT
ఎర్ర‌జెండా ఒక‌ప్పుడు ప్ర‌పంచ విప్ల‌వానికే త‌ల‌మానికంగా ఉండేది. అలాంటి ఎర్ర జెండా పార్టీలు మ‌న‌దేశంలో ఆరేడు ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల ప‌క్షాన ఎన్నో పోరాటాలు చేశాయి. అధికారంలో ఉన్నా.. లేక‌పోయినా వీటి పోరాట స్ఫూర్తి మాత్రం అమోఘం. కేర‌ళ‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో సుదీర్ఘ‌కాలం అధికారంలో ఉన్న ఈ పార్టీల చ‌రిత్ర ఇక గ‌త‌మొంతో ఘ‌నం అన్న స్థాయికి దిగ‌జారిపోతోంది. ఇప్ప‌టికే బెంగాల్‌లో క‌మ్యూనిస్టుల‌ది గ‌త చ‌రిత్రే అవుతోంది. ఇక త్రిపుర‌లో సైతం బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది.

ఇక తెలుగు గ‌డ్డ‌పై సైతం ఎర్రాజెండా పార్టీలు అయిన సీపీఐ, సీపీఎం ద‌శాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేయ‌డంతో పాటు చ‌ట్ట స‌భ‌ల్లోనూ గ‌ణ‌నీయ‌మైన పాత్ర పోషించాయి. ఆ పార్టీల నుంచి ఎంతో మంది మ‌హానుభావులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎంపికై తెలుగు రాజ‌కీయాల్లో పోరాటాల ద్వారానే త‌మ‌దైన ముద్ర వేశారు. అలాంటి ఎర్ర జెండా పార్టీలు ఇప్పుడు తెలుగు గ‌డ్డ మీద త‌మ ఉనికిని కోల్పోయే ప్ర‌మాద స్థితికి వ‌చ్చేశాయి. కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత తెలుగు అసెంబ్లీలో ఆ పార్టీల‌కు అస్స‌లు ప్రాధినిత్యం లేకుండా పోయింది.

2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఎం ఒక ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాలు, సీపీఐ ఒక ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవ‌డంతోనే ఈ పార్టీల ఆఖ‌రి గొప్ప ఘ‌న‌త అయ్యింది. అక్క‌డ నుంచి ఆ పార్టీల గ్రాఫ్ శ‌ర‌వేగంగా ప‌త‌న‌మైంది. ఇక 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు ఏకంగా 62 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌మ్యూనిస్టుల‌కు ద‌క్కిన గొప్ప గౌర‌వం ఇది. అప్ప‌టి నుంచి ఈ పార్టీల ప‌త‌న ద‌శ ప్రారంభ‌మైంది.

2009లో సీపీఎం 1 - సీపీఐ 4 :

2009 ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో తీవ్రంగా విబేధించి చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి టీడీపీ, టీఆర్ఎస్‌తో జ‌ట్టుక‌ట్టిన క‌మ్యూనిస్టుల‌కు ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో సీపీఎం మిర్యాల‌గూడ‌తో స‌రిపెట్టుకుంటే.... సీపీఐకు 4 సీట్లు వ‌చ్చాయి. ఇక 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో సీపీఎం భ‌ద్రాచ‌లం... సీపీఐ దేవ‌ర‌కొండ‌తో స‌రిపెట్టుకున్నాయి. ఇక అప్పుడు ఏపీలో అస‌లు క‌మ్యూనిస్టుల‌కు ప్రాథినిత్య‌మే లేకుండా పోయింది.

2019లో అక్క‌డా జీరో... ఇక్క‌డా జీరో...

2018 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టులు అస‌లు ఖాతాయే తెర‌వ‌లేదు. ఘోరంగా ఓడిపోయాయి. తెలంగాణ‌లో ఆ పార్టీల‌కు ఉన్న ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది. ఇక ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌నసేన‌తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీల అడ్ర‌స్ ఖ‌ల్లాస్ అయ్యింది. ఏదేమైనా క‌మ్యూనిస్టులు నేటి త‌రం యువ‌త‌కు చేరువు అవ్వ‌డంలో.... వారి సిద్ధాంతాలు ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ చేయ‌డంలో ఫెయిల్ అవ్వ‌డంతో ఆ పార్టీలోకి వెళ్లే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిపోతూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు ఆ పార్టీల్లో పాత‌త‌రం నేత‌లు త‌ప్ప ఎవ్వ‌రూ మిగిలే ప‌రిస్థితి లేదు.
Tags:    

Similar News