క‌లిసేందుకూ పంచ‌వ‌ర్ష ప్రణాళికేంది కామ్రేడ్స్‌

Update: 2017-07-11 05:53 GMT
దేశాన్ని ఉద్ద‌రించేందుకు త‌మ‌కు మించిన మొన‌గాళ్లు లేర‌ని చెప్పుకోవ‌టం రాజ‌కీయ పార్టీల‌కు మామూలే. ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని చెబుతూ.. పాల‌కుల త‌ప్పుల్ని నిత్యం ఎత్తి చూపే క‌మ్యూనిస్టులు.. ఒకే భావ‌జాలంతో ఉండే రెండు క‌మ్యూనిస్టు పార్టీలు అవ‌స‌రం ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు సూటి ప్ర‌శ్న చెప్ప‌రు. అదేమంటే.. చ‌రిత్ర‌ను చూపిస్తుంటారు.

ఆ ముచ్చ‌ట ఎందుకు సూటిగా పాయింట్ చెప్ప‌మంటే నీళ్లు న‌మిలే ప‌రిస్థితి. ఒకే గ‌మ్యానికి రెండు దారుల్లో ప్ర‌యాణాలు మొద‌లెట్టి.. ఎంత‌కూ అనుకున్న ల‌క్ష్యానికి చేరుకోలేక‌పోతున్న క‌మ్యూనిస్టులు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెప్పాలి. ఇంత‌కాలం సీపీఎం.. సీపీఐ అంటూ రెండు కుంప‌ట్లు పెట్టుకొని బండి లాగిస్తున్న క‌మ్యూనిస్టులు తాజాగా క‌లిసిపోవాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇందుకు సంబంధించిన కీల‌క వ్యాఖ్య‌ను సీపీఐ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి చేశారు. 1964లో క‌మ్యూనిస్టు పార్టీ చీలిపోయిన నాటి ప‌రిస్థితులు ఇప్పుడు లేవ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఈ కార‌ణంతోనే విలీనం జ‌ర‌గ‌నున్న‌ట్లుగా చెప్పారు. స‌యోధ్య‌తో క‌లిసి ఉంటేనే మ‌నుగ‌డ సాధించ‌గ‌ల‌మ‌ని.. లేకుంటే రెండింటికీ ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న ఆయ‌న‌.. ఒకే లక్ష్యంతో.. సారూప్య‌త‌తో పోరాటాలు సాగిస్తున్న రెండు పార్టీలు వేర్వేరుగా ఉండి ఉద్య‌మాలు సాగించ‌టం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మ‌న్నారు.

రాత్రికి రాత్రే ప‌రిస్థితుల్లో మార్పులు వ‌స్తాయ‌ని తాను చెప్ప‌టం లేదు కానీ..  తామిద్ద‌రం క‌లిసి ప‌ని చేస్తే మాత్రం మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు. రెండు పార్టీల్లోనూ విలీనంపై కొంత సానుకూల దృక్ప‌థం ఉంద‌ని.. అయితే సీపీఎం నాయ‌క‌త్వంతో త‌మ పార్టీ చ‌ర్చించ‌లేద‌ని చెప్పారు.

క‌లిసి పోవ‌టానికి సీపీఎం ముందుకు రావ‌టం లేద‌న్న సుర‌వ‌రం.. వ‌చ్చే ఏడాదిలో రెండు పార్టీల మ‌ధ్య ఉన్న‌త స్థాయి స‌మావేశాల నేప‌థ్యంలో విలీనం అయ్యే అంశం అప్ప‌ట్లో వ‌స్తుంద‌ని చెప్పారు. విలీనం అన్న‌ది రెండు పార్టీలు క‌లిసి తీసుకోవాల్సిన నిర్ణ‌యం కానీ.. అందుకు భిన్నంగా సుర‌వ‌రం వారు.. త‌మ పార్టీలోకే సీపీఎం క‌లిసి పోతుంద‌న్న మాట‌లు వారి ఇగోను హ‌ర్ట్ చేయ‌వా? క‌లిసి పోవాల‌నుకునే వారు క‌ల‌హం క‌లిగేలా మాట్లాడ‌టంలో అర్థం ఏమైనా ఉందా సుర‌వ‌రంజీ? క‌ల‌వ‌టం అన్న‌ది స‌హ‌జ‌సిద్ధ‌మ‌న్న ప్ర‌క్రియ మాదిరి జ‌ర‌గాలే కానీ.. పంచ‌వ‌ర్ష ప్రణాళిక పెట్టుకుంటే అయ్యే ప‌నేనా?
Tags:    

Similar News