బీజేపీకే ఓటు ప‌డేలా మోడీ కుంభ‌కోణం..

Update: 2018-07-16 04:59 GMT
ఇటీవ‌లి కాలంలో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారిన ఈవీఎం ప‌నితీరుపై మ‌రో వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు పడేలా ఈవీఎంల కుంభకోణం జరిగిందని ఆయ‌న ఆరోపించారు. అందుకే మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈవీఎంలను తయారుచేసిన జపాన్‌ కు వెళ్లారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లో బీఎల్‌ ఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత - తెలంగాణలో బహుజన ప్రభుత్వం - ఓటరు పాత్ర అన్న అంశంపై జరిగిన సదస్సుకు ఏచూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈవీఎంలపై అనేక ఆరోపణలు వస్తున్నాయనీ - కాబట్టి ఈవీఎంలకు ప్రింటింగ్‌ మిషన్స్‌ కూడా ఏర్పాటు చేయాలనీ - తద్వారా ఓటు ఎవరికి పడిందో తెలుసుకునే వీలు కల్పించే అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రభుత్వంలో స్థానం కల్పించాలన్నారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ..గడిచిన నాలుగేళ్ల‌లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. ప్రయివేటీకరణతో విద్యా - వైద్యం సామాన్య ప్రజలకూ దూరమవుతున్నాయని అన్నారు. వీటి పరిరక్షణకు ప్రత్యామ్నాయ విధానాలతో కూడిన రాజకీయాలు అవసరమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోడీ వస్తారా..? రాహుల్‌ గాంధీ వస్తారా అనే చర్చ జరుగుతున్నదని - ఇది అనవసరమనీ - దేశానికి నేతలు ముఖ్యం కాదని - విదానాలు ముఖ్యమని స్పష్టం చేశారు. కేంద్రం మతోన్మాదాన్ని పెంచి సామాజిక ఐక్యతను చీలుస్తున్నదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించకపోతే ప్రజల భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల నుంచి పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానాన్ని రద్దుచేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. వర్సిటీ గ్రాంట్ కమిషన్‌ ను తన అధీనంలోకి తీసుకోవడానికి కుట్ర చేసిందన్నారు.

అంతకుముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజాగాయకుడు గద్దర్‌ ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తామని, చట్టసభలకు పంపుతామని హామీ ఇచ్చారు. కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ తనకు ఓటు లేదనీ, త్వరలోనే నమోదు చేసుకుంటానని గద్దర్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తున్నదని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒక్క ఓటు రాజకీయ సమానత్వం కోసం, పోరాట రూపంగా మారబోతున్నదని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య కాలం నాటి పరిస్థితులు నేడు లేవని - నూతన పార్లమెంట్‌ విధానం రావాల్సి ఉందని అన్నారు. నేపాల్‌ లో ఎర్రజెండా పార్టీలను ఏకం చేసిన సీతారాం ఏచూరి - దేశంలోని వామపక్షాలనూ ఐక్యం చేయాలని కోరారు.
Tags:    

Similar News