సైరస్ మిస్త్రీ కారు నడిపింది ఆమేనట.. ప్రమాదం జరిగింది ఎలానంటే?

Update: 2022-09-05 04:49 GMT
ఆదివారం చోటు చేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం యావత్ దేశం నిర్ఘాంతపోయేలా చేసింది. దీనికి కారణం టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ  ఆ రోడ్డు ప్రమాదంలో మరణించటమే. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని మొదలు రాజకీయ పార్టీలన్ని స్పందించాయి. ప్రముఖులు పెద్ద ఎత్తున తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే.. ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? ఆయన ప్రయాణిస్తున్న కారును నడిపింది ఎవరు? అసలు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారు? వారిలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది? అసలు ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెల్లడయ్యాయి.

55 ఏళ్ల సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారును డ్రైవ్ చేసింది ఒక మహిళ అన్న విషయాన్ని గుర్తించారు. ప్రత్యక్ష సాక్ష్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు వెనుక కూర్చున్న ఇద్దరు మరణిస్తే.. డ్రైవ్ చేస్తున్న మహిళ.. పక్కన ఉన్న ఆమె భర్త గాయాలతో బయటపడినట్లుగా చెబుతున్నారు. అతి వేగం కూడా కారును కంట్రోల్ చేసే విషయంలో తేడా కొట్టిందన్న మాట వినిపిస్తోంది.

మిస్త్రీ ప్రయాణించిన కారు మెర్సిడెస్ బెంజ్ కాగా.. కారును ముంబయికి చెందిన 55 ఏళ్ల అనహిత పండోలే అనే ప్రముఖ గైనకాలజిస్టు నడిపినట్లుగా గుర్తించారు. అహ్మదాబాద్ నుంచి బయటుదేరిన వారు ముంబయికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వీరి కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో వేగంపై నియంత్రణ కోల్పోయి.. డివైడర్ ను ఢీ కొట్టారు. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న సమాచారం ప్రకారం.. కారును ఒక మహిళ నడిపారని.. ఎడుమ వైపు నుంచి వస్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారని.. ఆ సమయంలో కారు మీద పట్టు కోల్పోయి పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టినట్లు చెప్పారు.

ప్రమాదం జరిగిన పది నిమిషాల వ్యవధిలోనే సాయం అందటం.. కారులో నుంచి ఇద్దరిని గాయాలతో బయటకు తీసి ఆసుపత్రికి పంపారు. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో.. ప్రముఖ గైనకాలజిస్టు అనహిత పండోలే (55), ఆమె భర్త డారియస్ పండోలే (60) ముందు సీట్లలో కూర్చున్నారు.

వీరిలో అనహిత పండోలే కారు నడిపారు. కారు వెనుకవైపు టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ.. డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ పండోలేలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News