రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా?’ సామెత చెప్పి వరాలు

Update: 2021-08-17 03:48 GMT
ఎత్తు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇచ్చే వరాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఇచ్చే వరం ఏదైనా సరే.. కడుపు నిండిపోవాలన్నట్లు ఉండాలన్నట్లుగా కేసీఆర్ తీరు కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగుల డిమాండ్లను తీర్చే వేళలోనూ ఆయన మాటలతోనే కడుపు నిండిపోతుంది. అలాంటిది ఆయన పర్సనల్ గా తీసుకున్న దళిత బంధు కార్యక్రమం ఎంతలా సాగుతుందనటానికి వీలుగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి. కేసీఆర్ మదిలో పుట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు వచ్చిన కేసీఆర్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

సామెత చెప్పి మరీ.. దళిత బంధు పథకం అమలు విషయంలో తన కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటమే కాదు.. తనను వేలెత్తి చూపించే వారు.. మళ్లీ వేలు చూపించే సాహసం చేయని రీతిలో ఆయన తాజా నిర్ణయాలు ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకు దళిత బంధు పథకం అమలుకోసం హుజురాబాద్ లో రూ.500 కోట్ల అనుకున్న దానికి భిన్నంగా ఏకంగా రూ.2వేల కోట్లు మంజూరుచేస్తామని చెప్పిన తీరు చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ ఎంత కసిగా ఉన్నారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఇందుకు ఆయన చేసిన వ్యాఖ్యనే నిదర్శనంగా చెప్పాలి.

‘‘రాజే తలచుకుంటే దెబ్బలకు కొదువా..? ప్రభుత్వమే తలచుకుంటే పథకం ఇవ్వలేదా? పథకం కేవలం 15 మందికేనా అని కొందరు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఉన్న 21వేల దళిత కుటుంబాలకు రెండు నెలల్లో పథకం అమలు చేస్తాం. నియోజకవర్గానికి ఇచ్చిన రూ. 500 కోట్లకు అదనంగా 15 రోజుల్లో మరో రూ. 2,000 కోట్లు మంజూరు చేస్తాం’’ అని తేల్చేసిన వైనం చూస్తే.. దళిత బంధు పథకం అమలు విషయంలో కేసీఆర్ ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం కాక మానదు. తనకు తిప్పలు తప్పవన్న సందేహాల్ని తన తాజా వ్యాఖ్యలతో సింపుల్ గా తేల్చేశారు.

విపక్షాలు తనను విమర్శిస్తున్న విమర్శలకు సమాధానాన్ని ఇస్తూ.. ఆయన సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకాన్ని ముమ్మాటికి వందశాతం విజయవంతం చేస్తామని చెప్పిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం రానున్న మూడునాలుగేళ్లలో రూ.1.75లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ముందు నిరుపేదలకు ఈ పథకం కింద రూ.10లక్షలు ఇస్తామని.. తర్వాత మిగిలిన కుటుంబాలకు ఇస్తామని చెప్పటం గమనార్హం.

దళితబంధు పథకం చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేస్తామన్న కేసీఆర్ తాజా మాట సంచలనంగా మారింది. దీనికి ఆయన ఏమని చెప్పారంటే.. ‘‘రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రం గాల్లో దళితులకు కొన్ని అవకాశాలు చిక్కాయి. అయినా 95% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు. అందుకే ఆఖరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘దళితబంధు’అందజేయాలని అనుకుంటున్నాం. దీని లబ్ధిదారులకు ఇతర పథకాలేవీ రద్దు కావు’’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ దళితబంధు పథకానికి లబ్థిదారుల్ని ఎలా ఎంపిక చేస్తారన్న దానికి ఆయన సమాధానం చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దళితబంధు పథకానికి లబ్థిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.

సర్వే ఎనిమిదేళ్ల నాటిది కావటంతో ఇప్పుడు అదనంగా రెండు..మూడు వేల మంది లబ్థిదారులు పెరిగినా.. నష్టం లేదన్న ఆయన.. హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేసి తీరుతామన్నారు. దళితబంధు పథకం అమలులో భాగంగా హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన వేదిక మీద తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఎంపిక చేసిన 15 మంది లబ్థిదారులకు రూ.10లక్షలు చొప్పున చెక్కులు అందజేశారు. దళితబంధు పథకం అమలులో భాగంగా.. బ్యాంకు ఖాతాలు వేరుగా తెరిపిస్తామని. బ్యాంకులు వారి అప్పుల్ని కట్ చేసుకోకుండా చూస్తామని చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News