దానం.. ఇప్పుడీ మాట‌లు అస్స‌లు సూట్ కావు!

Update: 2018-09-03 05:26 GMT
ఏళ్ల‌కు ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి.. కీల‌క ప‌ద‌వుల్ని చేసిన ఆయ‌న‌కు రానున్న రోజుల్లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ అంతా గులాబీ కారులోనే ఉంద‌నుకోవ‌టం.. ఆ వెంట‌నే మంత‌నాలు జ‌రిపి ఒక మంచి ముహుర్తంలో కారు ఎక్కేశారు. అప్ప‌టి నుంచి త‌న‌ను తాను నిరూపించుకోవ‌టానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి త‌న‌కిచ్చే అవ‌కాశం కోసం ఎదురుచూశారు. చివ‌ర‌కు ఆయ‌న కోరుకున్న‌ట్లే కొంగ‌ర‌లో నిర్వ‌హించే జాత‌రకు సంబంధించిన బాధ్య‌త‌ల్ని ఆయ‌న‌కు అప్ప‌జెప్పారు. తొలిసారి కేసీఆర్ త‌న‌కు ప‌ని అప్ప‌గించిన నేప‌థ్యంలో దానం ఒక రేంజ్లో చెల‌రేగిపోయారు.

భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేప‌ట్టారు. ఇంత క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ.. సారూ కాస్తంత‌ ఆల‌స్యంగా వ‌చ్చుడే కాదు.. ఉప్పు కారం లేని రీతిలో చ‌ప్ప‌గా ప్ర‌సంగాన్ని చేసేయ‌టంతో పార్టీ వ‌ర్గాల‌తో పాటు.. అభిమానుల్లోనూ.. సానుభూతిప‌రుల్లోనూ ఆందోళ‌న కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇదే తీరు రానున్న రోజుల్లో కొన‌సాగిస్తే.. మొద‌టికే మోసంగా మార‌టం ఖాయమ‌న్న భావ‌న మొద‌లైంది.

ఇలాంటివేళ‌.. మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ మాట్లాడుతూ.. త‌మ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ లోని పెద్ద త‌ల‌కాయ‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. రెండు రోజుల్లో వారి పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా పేర్కొని కొత్త గుబులును రేపారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌తి రోజూ గొడ‌వ‌లు.. స‌రైన ప్రాతినిధ్యం లేక‌పోవ‌టంతో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ అట్ట‌ర్ ప్లాప్ కావ‌టంతో తెలంగాణ రాజ‌కీయ ప‌రిణ‌మాల్లో మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి.మొద‌ట గులాబీ కారులో ఎక్కాల‌నుకున్న వారు సైతం ఇప్పుడు మ‌రోసారి దీర్ఘాలోచ‌న‌లో ప‌డిపోవ‌టం ఖాయం. ఇలాంటివేళ‌.. దానం మాత్రం కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వ‌చ్చేందుకు బారులు తీరిన‌ట్లుగా చెబుతున్నారు. అదెంత వ‌ర‌కూ నిజ‌మో.. రానున్న రోజులు స్ప‌ష్టం చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News