షాకింగ్: ఏపీ..తమిళనాడుల్లో రికార్డు కేసులకు ఆ గుప్పెడు మందే

Update: 2020-10-02 10:50 GMT
దేశంలో కోవిడ్ కేసులు అధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఏపీ.. తమిళనాడులు ఉంటాయి. పక్కపక్కనే ఉండే ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎంత భారీగా నమోదవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచ దేశాల్ని పక్కన పెడితే.. భారత దేశంలో వైరస్ వ్యాప్తి అసలు ఎలా జరిగింది? అన్న సందేహాన్ని తీర్చుకునేందుకు అమెరికాకు చెందిన ఒక సంస్థ నడుం బిగించింది.

దేశంలో అత్యధికంగా కేసులు నమోదయ్యే రెండు రాష్ట్రాలు.. అది కూడా పక్కపక్కనే ఉండే ఏపీ.. తమిళనాడుల్ని ఎంపిక చేసుకుంది. ఆపై భారీ ఎత్తున పరిశోధనలు చేపట్టింది. ఇంతకీ ఈ అధ్యయనం చేసిన సంస్థ ఏదంటే.. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్.. ఎకనమిక్స్ అండ్ పాలసీ. ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రత్యేకత ఏమంటే.. భారీగా సేకరించిన డేటాను ఈ సంస్థ విశ్లేషించింది. ఇంత భారీ కసరత్తు ఇప్పటివరకు జరగలేదని చెబుతున్నారు.

ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలు షాకింగ్ గా మారాయి. ఆగస్టు ఒకటి నాటికి ఆ రెండు రాష్ట్రాల్లో మొత్తం 4.35 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరందరి కాంటాక్ట్ జాబితాలో 30 లక్షల మంది ఉన్నారు. కాంటాక్టులో ఉన్న వారిలో 5.75లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 85వేల మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వైరస్ సోకిన వారిలో దాదాపు 70 శాతం మంది ఇతరులకు తమ వైరస్ ను అంటించలేదు.

అయితే.. అనూహ్యంగా పది శాతం మంది మాత్రం భారీ ఎత్తున వైరస్ వ్యాప్తికి కారణంగా చెబుతున్నారు. సదరు పది శాతం మంది సూపర్ స్పైడర్లుగా మారటమే కాదు.. భారీ ఎత్తున కేసుల నమోదుకు కారణమైనట్లుగా తేలింది. ఈ సూపర్ స్పైడర్లు రద్దీగా ఉండే ప్రాంతాలు.. లేదంటే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఇతరులకు అంటించేశారన్న విషయాన్ని గుర్తించారు.

రక్షణ ఏర్పాట్లు పెద్దగా చేపట్టకుండా.. భౌతిక దూరాన్ని పాటించకుండా ప్రయాణాలు చేసే వారిలో ఎక్కువమంది వైరస్ బారిన పడినట్లుగా గుర్తించారు. రోగులకు దగ్గరగా ఉంటూ ఆరు గంటల పాటు ప్రయాణం చేసే వారికి కరోనా సోకే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఇలాంటి వారికే వైరస్ సోకే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరో ఆందోళన కలిగించే విషయాన్ని గుర్తించారు.

ఏపీ.. తమిళనాడులో కోవిడ్ బారిన పడిన పెద్ద వయస్కుల్లో మరణాలు తక్కువగానే ఉన్నాయని.. అందుకు భిన్నంగా పాజిటివ్ గా గుర్తించిన అనతికాలంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ గా గుర్తించిన వారం.. పది రోజుల్లోనే ఎక్కువ మరణాలు చోటు చేసుకోవటం గమనార్హం. ఇదే తీరు అమెరికాలో పదమూడు రోజులుగా ఉంటే.. చైనాలో రెండు నుంచి ఎనిమిది వారాలుగా ఉంది. ఎందుకిలాంటి పరిస్థితి అంటే.. వ్యాధి ముదిరే వరకూ గుర్తించకపోవటం.. తర్వాత గుర్తించినా ఫలితం ఉండని పరిస్థితి. సో.. ఏపీ.. తమిళనాడు ప్రజలు చేసిన తప్పుల్ని మిగిలిన వారు చేయకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News