లుక్ బ్యాక్ స్పోర్ట్స్: కోహ్లి-రోహిత్..చాంపియన్ల నుంచి వైఫల్యం దాకా!
విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ.. సమకాలీన భారత క్రికెట్ లో దిగ్గజాలు.. టి20లు, వన్డేలు, టెస్టులు.. ఫార్మాట్ ఏదైనా, పిచ్ ఎలాంటిదైనా పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్.
విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ.. సమకాలీన భారత క్రికెట్ లో దిగ్గజాలు.. టి20లు, వన్డేలు, టెస్టులు.. ఫార్మాట్ ఏదైనా, పిచ్ ఎలాంటిదైనా పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్. మధ్యమధ్యలో కాస్త బ్రేక్ లు వచ్చినా.. 2007లో మొదలైన రోహిత్ శర్మ ప్రస్థానం.. 2008లో ప్రారంభమైన విరాట్ కోహ్లి పరుగు 2024 వరకు ఎక్కడా ఇబ్బంది ఎదురవలేదు. కానీ, ఈ ఏడాది మాత్రం ‘ముగింపునకు వచ్చేసినట్లే’ అనిపించింది.
ఇద్దరూ చాంపియన్లే..
ఆధునిక క్రికెట్ టి20ల్లోనూ విరాట్, రోహిత్ ల సత్తా ఏమిటో అందరూ చూసిందే. 2008 ఐపీఎల్ నుంచి వీరిద్దరూ ప్రతి సీజన్ లోనూ ఆడుతున్నారు. 2025 సీజన్ లోనూ ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే, 2024 మాత్రం ఇద్దరికీ మధురమైనది. ఎందుకంటే టి20 ప్రపంచ కప్ గెలవడంతోనే. వాస్తవానికి అప్పటికే ఈ ఫార్మాట్ కు దూరమైన ఇద్దరినీ అనూహ్యంగా ఎంపిక చేశారు. దానికి ప్రతిఫలంగా ప్రపంచ కప్ అందించారు. ఆ వెంటనే టి20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. జూనియర్ గా 2007 తొలి టి20 ప్రపంచ కప్ నెగ్గిన టీమ్ ఇండియా సభ్యుడైన రోహిత్.. అత్యంత సీనియర్ గా కెప్టెన్ హోదాలో 2024లో కప్ కొట్టాడు. ఇక కోహ్లి.. 2011 వన్డే ప్రపంచ చాంపియన్ జట్టులో జూనియర్ సభ్యుడు. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ గెలిచిన టీమ్ లోనూ ఉన్నాడు.
వన్డేలకు వీడ్కోలే?
రోహిత్ కు 37 ఏళ్లు నిండుతున్నాయి. విరాట్ కు 36 ఏళ్లు నిండాయి. ఇప్పటికే వీరిద్దరి ఫామ్ ఆందోళనకరంగా ఉంది. దీంతో వన్డేల నుంచి క్రమంగా తప్పుకోవడం ఖాయం. ఇందులోభాగంగానే జూలైలో శ్రీలంక టూర్ కు దూరంగా ఉండాలనుకున్నారు. కానీ, కొత్త హెడ్ కోచ్ గంభీర్ కోరిక మేరకు ఆడారు. కానీ, జట్టుతో పాటు వీరూ విఫలమయ్యారు. దీంతో 27 ఏళ్ల తర్వాత లంక మన జట్టుపై వన్డే సిరీస్ నెగ్గింది. 2025లో వీరిద్దరూ లేదా ఎవరో ఒకరు వన్డేలకు వీడ్కోలు పలకడం ఖాయం.
టెస్టుల్లోనూ కష్టమేనా?
2024లో కోహ్లి, రోహిత్ ఇద్దరికీ టెస్టులు పీడకలగా మారాయి. స్వదేశంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న కోహ్లి.. మళ్లీ ఈ ఏడాది బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో ఆడాడు. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో పాల్గొన్నాడు. ఈ టెస్టుల్లో కోహ్లి ఒక్కటే అర్థ సెంచరీ చేశాడు. ప్రస్తుత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. రెండో టెస్టులో ఫెయిలయ్యాడు. గత 14 టెస్టు ఇన్నింగ్స్ లో కోహ్లి ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీనే చేశాడు.
ఇక రోహిత్ ఇంగ్లండ్ తో, బంగ్లాతో, న్యూజిలాండ్ తో సిరీస్ లలో పాల్గొన్నాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ కు మాత్రమే అందుబాటులో లేడు. మొత్తం గత 12 ఇన్నింగ్స్ లో ఒక్కటే హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా బంగ్లాదేశ్ పై కావడం గమనార్హం.
మళ్లీ చాంపియన్లుగా రిటైరవుతారా?
2024లో టి20 ప్రపంచ కప్ అందించి చాంపియన్లుగా రిటైరైన వీరు.. 2025లో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ అందిస్తారా? ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు.
పరుగులు సాధించే సత్తా కనమరుగు
రోహిత్, కోహ్లి ఇద్దరూ పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కుర్రాళ్లు జైశ్వాల్, నితీశ్, గిల్ ఆట.. రోహిత్, కోహ్లిల ఆట చూస్తుంటే ఈ విషయం స్పష్టం అవుతోంది. దీనిని బట్టి చూస్తే.. 2025లో వీరిద్దరిలో ఒకరు టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకడం ఖాయం. టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు టీమ్ ఇండియా అర్హత సాధిస్తే సరి.. లేదా ముందే వీరిలో ఒకరి టెస్టు కెరీర్ ముగిసినా ఆశ్చర్యం లేదు.