వైరస్ చుట్టేస్తున్న వేళ.. ఆక్రమిత కశ్మీర్ మాటేంది రాజ్ నాథ్

Update: 2020-06-15 08:50 GMT
ఓపక్క మాయదారి రోగం కారణంగా యావత్ దేశం కిందా మీదా పడుతున్న వేళ.. కొందరు నేతల నోటి నుంచి వస్తున్న మాటలు విచిత్రంగా ఉంటున్నాయి. కేంద్ర సర్కారుకానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతల మాటల్ని గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. యావత్ దేశం మొత్తం ఇప్పుడు మాయదారి రోగానికి కిందా మీదా పడుతూ.. రోజుకు పన్నెండువేల కేసులు నమోదవుతున్న పరిస్థితి. రానున్న రెండు వారాల్లో ఇది కాస్తా పాతిక వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

ఇలాంటివేళ.. కేంద్రం నోటి నుంచి ప్రజలకు భరోసా కలిగే మాటలు కావాలి. కానీ.. అందుకు భిన్నంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో కలిసి పోనున్న మాటలు ఎందుకు? అన్నది ప్రశ్న. అది కూడా ఐదేళ్లలో జరిగే విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమిటి? రానున్న ఐదేళ్లలో కశ్మీర్ లో చేసే అభివృద్ధి కార్యక్రమాలతో ఆ రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందన్న రాజ్ నాథ్.. ఆ పనులు చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్  ప్రజలు సైతం భారత్ లో భాగస్వామ్యులైతే బాగుండని కలలు కంటారని చెబుతున్నారు.

ఇలాంటి మాటలు ఎన్నికల వేళలోనూ.. మరో వేళలోనూ చెబితే లాభం ఉంటుంది. కానీ.. ఇప్పుడెందుకు చెబుతున్నారన్న సందేహం రావొచ్చు.దీనికోకారణం లేకపోలేదు. లాక్ డౌన్ వేళలో మోడీ గ్రాఫ్ భారీగా పెరిగితే.. సడలింపుల తర్వాత షాకింగ్ పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. ఆయన సమర్థత మీద కొత్త సందేహాలు తలెత్తే పరిస్థితి. లాక్ డౌన్ తర్వాత పెరుగుతున్న కేసుల తీవ్రత.. ఆయన మౌనముద్ర దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండాచేస్తోంది. ఇలాంటివేళ..పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారాన్ని తీసుకురావటం ద్వారా ప్రజల్లో భావోద్వేగాల్ని టచ్ చేయటమే లక్ష్యమన్న మాట వినిపిస్తోంది.

కేంద్రం మాత్రమే కాదు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలానే వ్యవహరిస్తున్నారు. కాటేసే వైరస్ కాటు గురించి కంటే కూడా ఆయన నోటి నుంచి వ్యవసాయం.. మిడతల దండు విషయాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు విషయానికి వస్తే.. ఆయన ఫోకస్ అంతా విపక్ష నేతలు చేసిన అవినీతి మీదా.. దాన్ని నిరూపించే క్రమంలో వరుస పెట్టి అరెస్టులతో ఉన్నారు. ఇదంతా చూసినప్పుడు.. ప్రజలకు అత్యవసర సమస్యల్ని పరిష్కరించే సత్తా లేకనే.. ఇలాంటి రాజకీయ చర్యలకు తెర తీస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాల ఫోకస్ మొత్తం ప్రజల ఆరోగ్యం.. వైరస్ కట్టడి మీదనే ఉండాలన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News