దేశంలో కోటి దాటిన కరోనా పాజిటివ్ కేసులు!

Update: 2020-12-19 08:50 GMT
ఇండియా లో కరోనా వైరస్ మహమ్మారి  పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్కును దాటేశాయి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు అమెరికా తరువాత భారత్‌ లో నమోదయ్యాయి. తాజాగా  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,00,04,599 మందికి కరోనా వైరస్ నిర్దారణ అయింది.

తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 25,153 మందికి కరోనా నిర్ధారణ అయింది.  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599కు చేరింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,00,90,514 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న 11,71,868 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,07,079 యాక్టివ్ కేసులుండగా.. ఆ రేటు 3.09శాతానికి చేరింది. 95,49,923 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు కూడా 95 శాతంపైనే ఉంది. గత వారం రోజులుగా మరణాల సంఖ్య 400 దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో 347 మంది మరణించగా..మొత్తం మరణాల సంఖ్య 1,45,171కి చేరింది.

ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌ లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ , జర్మనీ , రష్యా  , బ్రిటన్   ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో , ఇటలీ   తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. దేశంలో జనవరి 30న తొలి కరోనా కేసు కేరళలో నమోదుకాగా.. 325 రోజుల్లో పాజిటివ్ కేసులు కోటికి చేరుకున్నాయి. కరోనా వైరస్ విషయంలో మిగతా దేశాల కంటే భారత్ ముందే అప్రమత్తమయ్యింది.
Tags:    

Similar News