ఎటీఎంలలో గలగలలే గలగలలు?

Update: 2015-10-18 04:25 GMT
ఎంకి పెళ్లి సుబ్బడి చావు కొచ్చిందో లేదో గానీ, వరుస సెలవుల జాతరతో బ్యాంకులకు కొత్త సమస్య పుట్టుకొచ్చింది. వచ్చే వారం దసరా సందర్భంగా నాలుగైదు రోజులపాటు సెలవులు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏటీఎంలలో అదనపు సొమ్మును నిల్వ ఉంచడానికి ఆపసోపాలు పడుతున్నాయి. తమిళనాడు - పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో అయితే అక్టోబర్ 21 నుంచి 25 వరకు పండుగలు, వారాంతపు సెలవులు కారణంగా ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు మూతపడనున్నాయి. ఉద్యోగులు అక్టోబర్ 19 - 20 తేదీల్లో కాజువల్ లీవ్ పెట్టుకున్నట్లయితే వారం రోజుల పాటు వారికి సెలవులు లబిస్తాయి.

ప్రతి రెండో - నాలుగో శనివారాలు సెలవుదినాలుగా బ్యాంకులు ఇటీవలే ప్రకటించినందువల్ల అదొక అదనపు సెలవుగా కొందరికి లభించనుంది. ఈ సెలవుల మాటేమో గానీ, వరుసగా అయిదురోజులపాటు కస్టమర్లకు తగినంత డబ్బును అందుబాటులో ఉంచడానికి వివిధ బ్యాంకులు తమ ఎటీఎంలను పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. ఏటీఎం లను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలనే ఆలోచన కూడా దివ్యంగానే ఉంది. అయతే ఏటీఎం లను ధ్వంసం చేసి సొమ్ము కాజేసే ముఠాలకు ఆశ పుట్టించకుండా.. కాస్త భద్రతను కూడా బ్యాంకు వర్గాలు పెంచుకుంటే బాగుంటుంది.

మన దేశంలో వరుస సెలవులు అనేవి ఉద్యోగులకు కొత్త కానప్పటికీ, ఇలా ఒకే వారంలో అయిదారు రోజులు సెలవుల కింద వస్తే అది కస్టమర్లకు కొత్త సమస్యలను సాధించిపెడుతుందని బ్యాంకులు కలవరపడుతున్నాయి.. రెండో, నాలుగో శనివారాల సెలవును ఆ పక్క వారాలకు మార్చడం ద్వారా ఈ ఏకకాల సెలవుల జాతరను నియంత్రించవచ్చని యూనియన్లు సైతం అభిప్రాయపడటం గమనార్హం.

Tags:    

Similar News