డాన్ ముంబయి వస్తున్నాడా?

Update: 2016-08-16 09:27 GMT
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబయి వస్తున్నాడా..? ఇండియన్ ఇంటిలిజెన్సుతో పాటు దావూద్ శత్రువులు కూడా ఇప్పుడు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. ఆరా తీస్తున్నారు. చాలాకాలంగా పాకిస్థాన్ లో తలదాచుకున్న దావూద్ ను పట్టుకోవడానికి మన పోలీసులు ప్రయత్నిస్తుంటే.. మట్టుపెట్టడానికి అతడి శత్రువులు మాటువేసి ఉన్నారు. ఇలాంటి సమయంలో దావూద్ ముంబయి వచ్చే అవకాశాలున్న సందర్భం వచ్చింది. అది... ఆయన మేనల్లుడి పెళ్లి. కానీ, ఇండియా వస్తే వెంటనే అరెస్టు చేస్తారు. అంతేకాదు.. పెళ్లిలో దావూద్ టార్గెట్ గా పేలుళ్లు వంటివి జరిగే ప్రమాదమూ ఉంది. కాబట్టి దావూద్ ఇక్కడకు రాడని.. పాకిస్థాన్ లో ఉంటూనే స్కైప్ లో ఈ వివాహాన్ని తిలకిస్తాడని చెబుతున్నారు.

దావూద్ సోదరి హసీనా పార్కర్ చిన్నకుమారుడైన అలీషాహ్ పార్కర్‌ కు బుధవారం పెళ్లి. హసీనాకు ముగ్గురు పిల్లలు కాగా... పెద్ద కొడుకు 2006లోనే యాక్సిడెంట్ లో చనిపోయాడు. కూతురికి గతేడాదే పెళ్లి చేశారు. ఇప్పుడు చిన్న కొడుక్కి ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. వివాహం బుధవారం ఉదయం రసూల్ మసీదులో, రిసెప్షన్ జుహులోని తులిప్ స్టార్ హోటల్ లో జరగనున్నాయి.  డాన్ మేనల్లుడి వివాహం కావడంతో ఈ పెళ్లిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. వచ్చే బంధువుల గురించి ఆరా తీయనున్నారు. అలాగే దావూడ్ వ్యతిరేకులు కూడా ఆ పెళ్లిలో విధ్వంసం సృష్టించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు పోలీసు అధికారులు. ఈ పెళ్లికి దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ - అతని సోదరీమణులు జైతూన్ - ఫర్జానాలు వారి భర్తలతో కలిసి హాజరయ్యే అవకాశం ఉంది. పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోవాలని దావూద్ ఆదేశాలిచ్చాడట.

అయితే... చాలాకాలంగా పాక్ లోనే తలదాచుకుంటున్న దావూద్ ఎప్పటి నుంచో ముంబయి రావాలని అనుకుంటున్నాడని.. ఈ వివాహానికి రహస్యంగా మారు వేషంలో వస్తాడని కూడా ముంబయి క్రైం బ్రాంచి వద్ద సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. స్కైప్ లో పెళ్లిని చూస్తాడని ప్రచారం చేస్తూ పోలీసులను తప్పు దారి పట్టించి తాను రహస్యంగా హాజరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న అనుమానాలు పోలీసు వర్గాల్లో ఉన్నాయి. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తూ డాన్ వస్తే పట్టుకోవాలని రెడీ అవుతున్నారు.
Tags:    

Similar News