మొదటి రోజు 4.25లక్షల కోట్ల ఒప్పందాలట

Update: 2017-01-28 05:20 GMT
ప్రచారం చేసుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ప్రతి విషయానికి భారీ ఎత్తున ప్రచారం చేసుకొని.. తనలాంటి తోపు ఇంకెక్కడా ఉండనట్లుగా ఆయన వ్యవహరిస్తుంటారు. ఆయనకు వంత పాడే  బలమైన మీడియా పుణ్యమా అని.. చంద్రుడి మచ్చల కంటే కూడా.. చంద్రుడి ప్రకాశం మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మచ్చల కారణంగా వెలుగు సరిగా లేకపోయినా.. వాటికి దుర్మార్గ విపక్షాలే కారణంగా చెబుతుంటారు.

గడిచిన ఏడాది విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు  పెద్ద ఫార్సుగా జరగటం తెలిసిందే. రెండు రోజుల పాటు సాగిన ఈ భాగస్వామ్య సదస్సులో దాదాపు ఐదులక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని.. అందుకు తగ్గ ఒప్పందాల్ని ఏపీ సర్కారు చేసుకున్నట్లు చంద్రబాబు సర్కారు ఘనంగా గొప్పలు చెప్పేసుకుంది.

బాబు నేతృత్వంలో ఏపీ దూసుకెళుతుందంటూ అభినందనల్ని భజన సంఘం చేత కీర్తించేసుకున్న చంద్రబాబు.. నాడు చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులుగా గడిచిన ఏడాదిలో ఏపీకి వచ్చాయన్న సూటి ప్రశ్నకుఇప్పటివరకూ సమాధానం చెప్పింది లేదు. ఏదో చేద్దామని ఉత్సాహంతో ప్రయత్నిస్తున్న చంద్రబాబును విమర్శలతో కుళ్ల బొడుస్తారే? మీరంతా చంద్రబాబుకు వ్యతిరేకులంటూ కొందరు విరుచుకుపడుతుంటారు. తన పిల్లాడి మంచితనాన్ని.. గొప్పల్ని చెప్పుకోవటానికి ఏ తండ్రి అయినా ఇష్టపడతాడు. తపిస్తుంటాడు. అదే సమయంలో తప్పులు చెప్పటం.. అబద్ధాలతో కాలం గడిపే వారిని చూసి ఏ తండ్రి మురిసిపోరని మర్చిపోకూడదు.

కోట్లాది మంది ప్రజల్ని మభ్య పెట్టేలా మాటలు చెప్పటం.. వారిని భ్రమల్లో ఉంచేలా మాట్లాడటం ఎంతవరకు సబబు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇలాంటి వైఖరుల్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే.. నిష్ఠూరంగా ఉండే నిజాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ విమర్శలు చేసే వారు గుడ్డు మీద ఈకలు పీకుతున్నారనే అనుకుందాం. అలాంటిదే చేస్తే.. గత ఏడాది నిర్వహించిన సదస్సులో చేసుకున్నఒప్పందాల్లో ఎన్ని లక్షల కోట్లు ఏపీకి వచ్చాయి? ఆ ప్రాజెక్టుల వివరాలు ఏమిటి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? లాంటి అంశాలపై ఒక శ్వేతపత్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విడుదల చేయదన్నది సూటి ప్రశ్న

ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పలేని టీడీపీ నేతలు.. తమపై విమర్శలు చేసే వారిపై మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతుంటారు. తాజాగా జరిగిన ముచ్చటే చూద్దాం. గత ఏడాది లెక్కలకు ఇప్పటివరకూ సమాధానం లేకపోవటం తర్వాత.. తాజాగా విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడుల వరద ఏపీకి పారినట్లుగా ప్రకటనలు వెలువడ్డాయి. ఈ సదస్సుకు ముందు టీడీపీ నేతలు చెప్పినట్లుగా.. ఈసారి సదస్సు ముగిసే నాటికి కనీసం రూ.9లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతాయన్న మాటను చెప్పాలి. ఇందుకు తగ్గట్లే మొదటి రోజు రూ.4.25లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. కుదిరిన మొత్తం ఎంవోయూలు128 కాగా.. వీటితో 5.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లుగా చెబుతోంది.

ఇంత భారీ ఎత్తున జరిగిన ఒప్పందాల్లో అన్నేసి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వచ్చిన కంపెనీల్నిచూస్తే.. గెయిల్.. ఓఎన్ జీసీ.. హెచ్ పీసీఎల్ లు రూ.1.28లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టటానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన మొత్తానికి సంబంధించి పలు కంపెనీలు ఒప్పందాలుచేసుకున్నట్లుగా వెల్లడించారు. నిజంగా ఒప్పందాలుజరిగి.. అందుకు తగ్గట్లే పెట్టుబడులు ఏపీకి వస్తే సంతోషించని వారు ఎవరుంటారు? కాకుంటే.. రాని పెట్టబడుల్ని..కాగితం మీద మాత్రమే గొప్పగా కనిపించే వాటి గురించి మాత్రమే ప్రశ్నలన్నీ. ఏది ఏమైనా.. మొదటి రోజు సదస్సు ముగిసే నాటికి భారీ ప్రకటనలతో గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు.. రెండో రోజు ముగిసేనాటికి మరెన్ని గొప్పలు చెప్పుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News