2025పై చంద్రబాబు 'ముద్ర' ఖాయం!
సో.. మొత్తానికి చంద్రబాబు కలల ప్రాజెక్టుల్లో కీలకమైనవి అన్నీ కూడా.. జనవరి నుంచి ప్రారంభం అవుతున్నాయి.
2025 నూతన సంవత్సరానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వ సారథి సీఎం చంద్రబాబు పక్కా ప్లాన్ చేసుకున్నారు. విజన్-2047 ప్రకటనతో వచ్చే ఏడాది చేయాల్సిన పనులపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన ఆరు మాసాల పాలనకు భిన్నంగా అసలు పరిపాలన వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుందనడంలో సందేహం లేదు. నిజానికి కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఈ ఆరు మాసాల్లో చేయాల్సిన పనులు చేసినా.. అసలు అభివృద్ధికార్యక్రమాలు ఇంకా పట్టాలెక్కలేదు.
ముఖ్యమైన అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులు సహా.. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సూపర్ సిక్స్ కూడా.. వచ్చే జనవరి నుంచి పుంజుకోనున్నాయి. ఇప్పటికే ప్రకటించిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. జనవరి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అదేవిధంగా మార్చి నుంచి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, సహా మహిళలకు సంబంధించిన ఇతర పథకాలను కూడా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
అదేసమయంలో పోలవరం పనులు కూడా వచ్చే ఏడాది నుంచి పట్టాలెక్కనున్నాయి. అమరావతి రాజ ధాని పనులు కూడా పరుగులు పెట్టనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా నాబార్డు రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నిధుల్లో 25 శాతం నిధులను జనవరిలో కేటాయించనున్నారు. సో.. మొత్తానికి చంద్రబాబు కలల ప్రాజెక్టుల్లో కీలకమైనవి అన్నీ కూడా.. జనవరి నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీనిని బట్టి వచ్చే ఏడాది.. 2025లో చంద్రబాబు తరహా పాలన ఏపీలో ప్రారంభం అవుతుందనడంలో సందేహం లేదు.
ఇక, రాజకీయంగా కూడా.. అనేక మార్పులు జరగనున్నాయి. రాజ్యసభలో టీడీపీ కోల్పోయిన ప్రాభవం కూడా.. వచ్చేఏడాదే దక్కనుంది. తాజగా రాజ్యసభ సభ్యులుగా టీడీపీకి ఇద్దరు ఎంపికయ్యారు. అదేవిధం గా మంత్రివర్గంలోనూ నాగబాబుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, విజన్-2047 అమలు ప్రక్రియ కూడా.. జనవరి నుంచే మొదలు కానుంది. ఈ క్రమంలో 2025పై చంద్రబాబు ముద్ర ఖచ్చితంగా పడుతుందని తమ్ముళ్లు చెబుతున్నారు.
అభివృద్ధి, ఐటీ.. ఈ రెండు చంద్రబాబుకు రెండు కళ్ల వంటివి. ఈ రెండు కూడా వచ్చే 2025లో పుంజుకో నున్నాయి. వీటికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరానికి బలమైన పునాదులు పడతాయనే చెప్పాలి. అదేవిధంగా ప్రాంతాల వారీగా కస్టర్లు, ప్రాజెక్టులు వంటివి కూడా.. వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. ఇలా ఏ కోణంలో చూసుకున్నా.. వచ్చే ఏడాది కూటమి సర్కారుకు అత్యంత కీలకంతో పాటు.. తమదైన ముద్ర వేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం.