`ఉయ్యాల‌వాడ` న‌ర‌సింహారెడ్డి ఓ దోపిడీ దొంగ‌ట‌!

Update: 2018-01-28 09:11 GMT
ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలించిన బ్రిటీష్ పాల‌కుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన తొలి త‌రం స్వాతంత్ర్య సమరయోధుడు - రాయ‌ల‌సీమ ముద్దు బిడ్డ‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి! ఆ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి జీవిత చ‌రిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని ఈ చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. ఈ హిస్టారిక‌ల్ మూవీకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రంపై పెను వివాదం చెల‌రేగింది. వాస్త‌వానికి ఓ దోపిడీ దొంగ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్వాతంత్ర్య సమరయోధుడిగా చూపిస్తూ సినిమా తీస్తున్నార‌ని నెక్కెంటి శ్రీనివాసరావు అనే చరిత్ర అధ్య‌య‌న‌కారుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ అంశంపై ఓ న్యూస్ చానెల్ లో జ‌రిగిన డిబేట్ లో శ్రీ‌నివాస‌రావు - రచయిత-ఎగ్జిబిటర్ శ్రీనివాస్ రెడ్డి(ఫోన్ ద్వారా) - తిరుప‌తి ప్ర‌సాద్ - (నిర్మాత‌ - తిరుపతి నుంచి) - భూమన్ (రాయలసీమ అధ్యయన‌ సంస్థ కన్వీనర్) మ‌ధ్య వాడివేడి చ‌ర్చ జరిగింది.

వాస్త‌వానికి చ‌రిత్ర ప్ర‌కారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఓ ధీశాలి - స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు. భార‌త దేశ మొద‌టి స్వాతంత్ర్య యుద్ధం(సిపాయిల తిరుగుబాటు) 1857లో జరిగింది. కానీ, 1846 జూన్ లో బ్రిటీష్ పాల‌కుల‌పై తిరుగుబాటు బావుటా ఎగ‌రేసిన ఉయ్యాలవాడ 1847 ఫిబ్రవరిలో వీరమరణం పొందాడు. తెల్ల‌వారి వెన్నులో వ‌ణుకు పుట్టించి వీరమరణం పొందిన ఉయ్యాల‌వాడ‌పై శ్రీ‌నివాస‌రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాత నుంచి వారసత్వంగా వచ్చే 11 రూపాయలను ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి  బ్రిటీష్ వాళ్లు ఇవ్వలేదని - దాంతో ఆయ‌న దోపిడీకి తెగబడ్డాడడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్వార్థం కోసం దొంగత‌నాలు - దోపిడీల‌కు పాల్ప‌డ్డ ఉయ్యాలవాడను స్వాతంత్ర్య సమరయోధుడంటూ చిత్రీకరించ‌డం స‌రికాద‌ని శ్రీనివాసరావు వాదిస్తున్నారు.  ఉయ్యాలవాడ దేశభక్తుడు కాద‌ని,  ఆయన గురించి ప్రచారంలో ఉన్న‌దంతా అవాస్త‌వమ‌ని ఆరోపించారు. అస‌లు ఉయ్యాల‌వాడ‌కు సైన్యం లేద‌ని - ఆయ‌న తాత‌ల కాలం నాటికే పాలెగాళ్ల వ్య‌వ‌స్థ ర‌ద్ద‌యింద‌ని చెప్పారు. తాత‌ల నుంచి కేవ‌లం కోట మాత్ర‌మే ఉయ్యాల‌వాడ‌కు వార‌స‌త్వ ఆస్తిగా సంక్ర‌మించింద‌న్నారు. అంతేకాకుండా, `సైరా` చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ వాద‌న‌లో పాల్గొన్న నిర్మాత తిరుప‌తి ప్ర‌సాద్.... నెక్కెంటి శ్రీ‌నివాస్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. కేవ‌లం ఉయ్యాల‌వాడ‌ను కించ‌ప‌ర‌చ‌డానికే శ్రీ‌నివాస్ ఈ ర‌కమైన వ్యాఖ్య‌లు చేస్తున్నారని - కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే ఆయ‌న ఈ రోజు మీడియా ముందుకు వ‌చ్చార‌ని మండిప‌డ్డారు. ఉయ్యాల‌వాడ‌ను శ్రీ‌నివాస్ అవ‌మానిస్తున్నార‌ని, కేవ‌లం వార్త‌ల్లో నిలిచి వివాదం రేపి....ఎంతో కొంత డ‌బ్బులు దండుకోవ‌డానికి ఈ ర‌క‌మైన చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. సైన్యం అంతా కోటలో ఎందుకుంటుంద‌ని.....కొంత‌మంది బ్రిటిష్ వారికి వ్య‌తిరేకంగా శిక్ష‌ణ పొంది యుద్ధం స‌మ‌యంలో ఉయ్యాల‌వాడ‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని చెప్పారు. బ్రిటిష్ వారి ఆయుధాగారాన్ని - ధ‌నాగారాన్ని ఉయ్యాల‌వాడ‌ కొల్ల‌గొట్టి వారిని బ‌ల‌హీన ప‌ర‌చారని, యుద్ధంలో భాగంగా ఇటువంటి వ్యూహాలు సాధార‌ణ‌మ‌న్నారు. అవి కూడా తెలియ‌కుండా ఇటువంటి అర్థ‌ర‌హిత ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు. కేవ‌లం చిరంజీవి పై బుర‌ద జ‌ల్ల‌డానికి, ఆయ‌న సినిమాను అడ్డుకోవ‌డానికి శ్రీ‌నివాస్ వెనుక ఉండి కొంత‌మంది ఈ కుట్ర న‌డిపిస్తున్నార‌ని ఆరోపించారు. కాగా, ప‌ద్మావ‌త్ విష‌యంలో నానా ర‌చ్చ జ‌రిగి ఎట్టకేల‌కు విడుద‌ల అయిన నేప‌థ్యంలో.....సైరా పై చెల‌రేగిన వివాదం ఎటువంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో అన్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పవ‌చ్చు. 
Tags:    

Similar News