మానవత్వం మంటగలిసినవేళ.. కొత్తపథకం!

Update: 2016-08-12 05:02 GMT
మనిషి గొప్పోడా.. జంతువులూ పక్షులు ఇతర జీవులూ గొప్పవా? అదేమి ప్రశ్న... ఖచ్చితంగా మనిషే గొప్పవాడు. మిగిలిన అన్నింటినీ తన అధీనంలో పెట్టగలిగాడు, టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నాడు. కాని.. మిగిలినవన్నీ ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి కదా! సో.. మనిషే గొప్పవాడు. పైగా అతడికి ఉండే అద్భుతమైన గుణం మానవత్వం. ఇకపై ఈ విషయాలపై ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనే విషయాన్ని చెప్పేలా ఉంది తాజాగా జరిగిన ఒక సంఘటన. అనంతరం మనిషీ.. ఓ మనిషీ.. నీకు మానవత్వం ఉందా? అని తిరిగి మనిషిని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక ఘటన చూస్తే.. మనుషుల్లో రోజు రోజుకీ తగ్గిపోతున్న కనీస మానవతా దృక్పథం - సాటి మనిషన్న చిన్న జాలి కూడా ఇతరులపై లేకుండా "మనిషి"గా బ్రతికేస్తున్న చిత్రం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

బెంగాల్‌ కు చెందిన 35 ఏళ్ల మతిబుల్ అనే వ్యక్తి ఢిల్లీలోని తీహార్‌ సమీపంలో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్నాడు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అతడు ఇంటినుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ఒక వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మతిబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. లేవలేని స్థితిలో, కనీసం తన వద్దనున్న సెల్ ఫోన్ తో ఎవరికైనా విషయాన్ని చెప్పుకోలేని స్థితిలో పడిఉన్నాడు. ప్రమాదానికి కారణమైన ఆ వాహనం డ్రైవర్ కిందికి దిగి చూసి.. వెంటనే పారిపోయాడు. తెల్లవారుజామున ప్రమాదం జరిగితే.. ఉదయం వరకూ కూడా ఎవరూ అతడిని పట్టించుకోలేదు. అతనిపక్కనుంఛి ఎంతోమంది నడుచుకుంటూ వెళ్లారు, చూసుకుంటూ వెళ్లారు తప్ప.. ఏ ఒక్కరు స్పందించలేదు. మనిషి కదా! ఇదే సమయంలో ఆ అభాగ్యుడికి సాయం చేయాల్సింది పోయి.. ఓ దౌర్భాగ్యుడైతే అతడిపక్కన పడిఉన్న సెల్ ఫోన్ ను ఎత్తుకుని పారిపోయాడు. కాసేపటికి ఆ సెక్యూరిటీ గార్డు తన సాటి - తోటి మనుష్యులందరి ముందే నిస్సహాయుడిగా మరణించాడు. సుభాష్‌ నగర్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పడివున్నాడని పోలీసులకు ఫోన్‌ రావడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారమంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.

ఈ నేపథ్యంలో తనకు ప్రయోజనం లేకుండా మనిషి మరోమనిషి ఏమీ చేయడని భావించారో ఏమో కానీ.. ఈ సంఘటనన అనంతరం ఒక కొత్త పథకం తీసుకురావాలని భావిస్తొన్నారు ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు. రోడ్డుప్రమాదాలు - ఆపద సమయాల్లో బాధితులకు సాయం అందించి, వారిని కాపాడేవారిని గుర్తించి - సత్కరించాలని నిర్ణయించారు. ఈ విషయంలో అవార్డులతో పాటు రివార్డులు కూడా అందజేస్తామని, ఇందుకు ముందుకొచ్చే ట్యాక్సీ డ్రైవర్లు - రిక్షాకార్మికులకూ రివార్డులు అందిస్తామని ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్‌ జైన్‌ ప్రకటించారు.
Full View

Tags:    

Similar News