అధ్యక్షులూ... ఎమ్మెల్సీ ప్లీజ్... !

Update: 2019-01-11 17:39 GMT
తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఎంపికయ్యేందుకు పైరవీలు ప్రారంభించారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోను మార్చి నెలాఖరుకు దాదాపు 17మంది శాసనమండలి సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో ఒక్క తెలంగాణ నుంచి 12 మంది శాసనమండలి సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు శాసనమండలి సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ను శాసన మండలి ఎన్నికలు జోరుగా జరగనున్నాయి. ఇటీవల ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో శాసన సభ్యులుగా పోటీ చేయాలనుకున్న అనేక మంది ఆశావహులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానంది. దీంతో అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవలేదు. అధిష్టానం మాటకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవుల కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అనేకమంది నాయకులు శాసనమండలి కోసం పోటీపడుతున్నారు.

 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు హోం మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను ఎమ్మెల్సీగా తిరిగి సభకు పంపించే అవకాశం ఉంది. ఇక మిగిలిన పదకొండు స్థానాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావును తెలంగాణ భవన్లో అనేకమంది నాయకులు కలుసుకుని తమకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక అవకాశం ఉంటుందని కేటీఆర్ హామీ ఇస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో మాజీ స్పీకర్ మధుసూదనా చారి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత సన్నిహితుడుగా మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవి రావచ్చునని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కాకుండా మిగిలిన పది స్థానాల్లో ను పార్టీ విజయానికి పని చేసిన వారికి ఇస్తారని అంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి సభ్యులుగా ఐదుగురు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో మంత్రులు రామకృష్ణుడు, నారాయణ కూడా ఉన్నారు. ఇద్దరి పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగుస్తుంది. వీరిలో మంత్రి నారాయణ శాసన సభ్యుడిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. యనమల రామకృష్ణుడు మాత్రం ఎమ్మెల్సీ గానే కొనసాగాలని అనుకుంటున్నారు. పార్టీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు ఈసారి శాసనమండలి సభ్యులు అవుతారు. మిగిలిన నాలుగు స్థానాల్లో ను ఒక స్థానం ప్రతిపక్ష వైయస్సార్ సిపి కి దక్కుతుంది. మిగిలిన మూడు స్థానాల్లో ను అధికార తెలుగుదేశం పార్టీ ఎవరని ఎంపిక చేస్తుందోనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందే శాసన మండలి ఎన్నికలు జరుగుతాయని ఓ ప్రచారం ఉంది. అదే జరిగితే శాసనమండలి సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీకి తల నొప్పిగా మారుతుంది. ఒకరిని ఎంపిక చేసి మరొకరిని కాదంటే మొదటికే మోసం వస్తుందని పార్టీలో సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. దీంతో తమ అధినేత ఎవరిని శాసనమండలి సభ్యులుగా ఎంపిక చేస్తారు అని పార్టీలో సీనియర్ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు. తెలంగాణలో శాసన మండలి ఎన్నికలు సజావుగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News