కలవరం రేపిన 'పత్రిక' కథనం..సవాల్‌ విసిరిన పోలీసులు

Update: 2020-02-23 06:23 GMT
తెలంగాణలో ఈనాడు కథనం కలవరం రేపింది. పోలీస్‌ అధికారులు నిందితులతో కలిసి కుమ్మక్కయారని.. వారితో సత్సంబంధాలు నెరుపుతూ భారీగా వెనకేసుకుంటున్నారని తెలంగాణ పోలీసులపై ఆరోపిస్తూ ఈనాడు ‘దొంగలతో దోస్తీ’ అనే పేరుతో కథనం ప్రచురించింది. ఈ కథనంతో తెలంగాణ పోలీసులు అధికారులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. డైరెక్ట్‌ గా వివరాలు తెలపడంతో తెలంగాణ హోంమంత్రి ఘాటుగా స్పందించారు. ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిరాధార ఆరోపణలు చేసిన ఈనాడుపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రకటించడంతో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌ నగర పరిధిలోని ముగ్గురు కమిషనర్లు ఘాటుగా స్పందించారు.

ఫిబ్రవరి 22వ తేదీన ‘దొంగలతో దోస్తీ’ అనే కథనంలో తెలంగాణ పోలీస్‌ వ్యవహారంలో రాజకీయం ఎక్కువైందని ఆరోపించింది. దీనికి తోడు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో బేరసారాలు చేస్తూ వారే పరోక్షంగా పంచాయితీ నడిపిస్తూ చక్కబెడుతున్నారని ఆ కథనం సారాంశం. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ - వరంగల్‌ - మహబూబ్‌ నగర్‌ - మెదక్‌ జిల్లాలో జరిగిన పలు సంఘటనలను ఉదహరిస్తూ కథనం ప్రచురించింది. తెల్లవారి లేచి పత్రిక చదివిన తెలంగాణ పోలీస్‌ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీంతో పాటు రాజకీయ పలుకుబడితో పదోన్నతులు - బేరసారాలు చేస్తున్నారని - ప్రతిభ ఆధారంగా పోస్టింగ్‌ లు ఇవ్వడంలో ప్రధానంగా ఆరోపిస్తూ కథనం రావడంతో కలవరం మొదలైంది.

వెయ్యి కోట్ల దావా వేస్తాం..

ఈ కథనంపై హోంమంత్రి మహమూద్‌ అలీ మండిపడ్డారు. ఈ పత్రిక తీరును ఎండగట్టారు. చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. లేదంటే రూ.వెయ్యి కోట్లు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉగ్రవాదం - తీవ్రవాదం తదితర సంఘ విద్రోహక కార్యక్రమాలను తుడిచిపెడుతున్న పోలీసులపై ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. వెంటనే పత్రిక క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చర్యలు తీసుకుంటాం..

పోలీస్‌ శాఖ పూర్తి పారదర్శకంగా ఉందని, విధుల్లో రాజీపడకుండా పని చేస్తున్న పోలీసులపై అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అడిషనల్‌ డీజీ జితేందర్‌ తెలిపారు. ఇక దీనిపై పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌ - వీసీ సజ్జనార్‌ - మహేశ్‌ భగవత్‌ కూడా స్పందించి ఆ కథనాన్ని ఖండించారు. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఆ పత్రిక రాసిందని - దేశంలోనే ఆదర్శ పోలిసింగ్‌ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రానిదని చెప్పారు. అలాంటి పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. నిరాధార కథనాల్ని ప్రచురిస్తే భవిష్యత్‌ లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags:    

Similar News