కింగ్ మేక‌ర్ క‌రుణ కోసం పార్టీల ఆరాంటం

Update: 2022-02-08 02:30 GMT
గుర్మీత్‌ రాం రహీం సింగ్ అలియాస్ డేరా బాబా గుర్తున్నాడా? ఇద్దరు సాద్వీలపై లైంగికదాడి, హత్య కేసులో జైలు జీవితం అనుభ‌విస్తున్న‌ డేరా సచ్చా సౌదా చీఫ్. పంజాబ్‌లో ఓ రేంజ్‌లో ఫాలోవ‌ర్లు క‌లిగి ఉన్న డేరాబాబా ఇప్పుడు ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో కింగ్ మేక‌ర్ అయ్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలు ఎవరికి తోచినట్లు వారు పథక రచన చేస్తుండ‌గా సీన్లోకి డేరాబాబా వ‌చ్చేశారు.

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌.. ప్రస్తుతం రోహతక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పంజాబ్‌లోని 69 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం చూపనున్నట్లు ఆయా పార్టీలు అంచ‌నా వేశాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న పంజాబ్‌లోని రాజ‌కీయ పార్టీలు ఇప్పుడు డేరా బాబాను రంగ‌లోకి దింపుతున్నాయి. పెరోల్‌ తీసుకోవడం ప్రతి ఖైదీ హక్కు అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌ సింగ్‌ చౌతాలా ప్రకటన చేసి రెండు రోజులు కూడా గడవక ముందే..  డేరా బాబా పెట్టుకున్న 21 రోజుల పెరోల్‌ దరఖాస్తును హర్యానా జైళ్ల శాఖ ఆమోదించింది.

లైంగికదాడి, హత్య కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబా గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ను పెరోల్‌పై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. వీరి ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ఆయన జైలు నుంచి విడుదల అవుతున్నారు. డేరా బాబా పెరోల్‌పై వస్తుండటంతో... దాదాపు 69 అసెంబ్లీ స్థానాల్లో  డేరా బాబా ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటుండ‌టం వెనుక కార‌ణం గుర్మీత్ రాం రహీం ఏర్పాటు చేసుకున్న నెట‌వ‌ర్క్‌. డేరా బాబాకు పంజాబ్‌లోని 23 జిల్లాల్లో 300 డేరాలు ఉన్నాయి.

 ఈ డేరాలు రాష్ట్ర రాజకీయాల్లో  ప్రత్యక్షంగా పాల్గొంటాయి. పంజాబ్‌లోని మజా, మాల్వా, దోబా ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రోహ్‌తక్‌ కమిషనర్‌ సంతకం తర్వాత అతడిని సునారియా జైలు నుంచి బయటకు వస్తారు. సరిగ్గా పంజాబ్‌ ఎన్నికలకు 13 రోజుల ముందుగా ఆయనకు పెరోల్‌ దొరికింది. డేరా బాబా పెరోల్‌పై జైలు నుంచి బయటకు వస్తుండటంతో సునారియా జైలు వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.


Tags:    

Similar News