జైలే మేలు: పెరోల్ వ‌చ్చినా వినియోగించుకోని శ‌శిక‌ళ‌

Update: 2020-04-21 03:30 GMT
త‌మిళ‌నాడులో మాజీ ముఖ్య‌మంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి, ఆమె స్నేహితురాలు శశికళ జైలుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బ‌య‌ట ప‌రిస్థితులు స‌క్ర‌మంగా లేవు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డం.. లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చి పెద్ద‌గా చేసేదేమీ లేద‌ని భావించి ఆమె జైలుకే ప‌రిమిత‌మ‌య్యారు. ఎందుకంటే ఆమెకు పెరోల్ మంజూరైంది. ఆమెకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్‌పై ఇళ్ల‌కు పంపిస్తున్నారు.

ఈ క్రమంలో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ, ఇలవరసి, సుధాకర్‌ కు కూడా పెరోల్ అవకాశం లభించింది. అయితే ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో వారు ఆ అవ‌కాశాన్ని ఉపయోగించుకోలేదు. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయటి కంటే జైలులోనే ఉండడం మంచిదని భావించి జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌డం ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేద‌ని జైలు అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై శ‌శిక‌ళ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట కళగం వర్గాలు విజ్ఞ‌ప్తి చేసినా పెరోల్ ప్రయత్నాలను వారంతా తిరస్కరించారంట‌.

ప్ర‌స్తుతం ఆ జైలులో 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్ మీద వెళ్లారు. జైలులో అనేక గ‌దులు, జైలు ప్రాంగ‌ణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో జైలు కూడా క‌రోనా నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. బెంగళూరు పరస్పర అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ శశికళ, ఇల‌వ‌ర‌సి, సుధాక‌ర్ త‌దిత‌రుల‌ ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో జైలులో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. శశికళ ఉన్న గదిలో ముగ్గురు ఉండగా పెరోల్‌పై ఒకరు బయటకు వెళ్లడంతో ఇప్పుడు చిన్నమ్మతో పాటు ఇలవరసి మాత్రమే ఉన్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News