ధర్మానను ఎంపీగా పోటీ చేయమన్న జగన్...?

Update: 2023-06-21 09:00 GMT
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావుని ఈసారి ఎంపీ బరిలో నిలబెట్టాలని ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు అని జిల్లాలో ప్రచారం సాగుతోంది. వైసీపీలోనూ దీని మీద చర్చ సాగుతోంది. ఈ రోజుకు చూస్తే శ్రీకాకుళం ఎంపీ సీటుకు బలమైన అభ్యర్ధి ఎవరూ లేరు. ఎవరిని పెట్టినా గెలుపు అన్నది సందేహమే అన్నది వైసీపీకి అందుతున్న ఫీడ్ బ్యాక్.

అంత గట్టిగా సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహనాయుడు ఉన్నారు. ఆయన ఇప్పటికి రెండు సార్లు గెలిచి తిరుగులేని శక్తిగా అవతరించారు. హ్యాట్రిక్ కొట్టేలాగానే ఉన్నారు. వైసీపీ నుంచి సరైన అభ్యర్ధిని పెట్టకపోతే రామ్మోహన్ నాయుడుది క్యాట్ వాక్ లాంటి విజయమే అంటున్నారు. దాంతో తర్జన భర్జన పడుతున్న వైసీపీ అధినాయకత్వం ఎవరో ఎందుకు ధర్మాన ప్రసాదరావునే బరిలోకి దింపాలని ఒక కీలక డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు.

నిజానికి ఇదేమీ కొత్త ప్రతిపాదన కాదు, 2014, 2019లలో ధర్మాన ప్రసాదరావుని ఎంపీగానే పోటీ చేయమని జగన్ కోరారు. ఆనాడు ఆయన సున్నితంగా తిరస్కరించి ఎమ్మెల్యేగానే బరిలోకి దిగారు. మరో  దఫా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ధర్మాన పెద్దగా సుముఖంగా లేరని టాక్ నడుస్తోంది. తన కుమారుడు రామ మనోహర్ నాయుడుని శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయించాలని చూస్తున్నారు.

అయితే ఇక్కడే వైసీపీ హై కమాండ్ ఒక ఆఫర్ ఇస్తోందా అన్న చర్చ సాగుతోంది. జూనియర్ ధర్మానకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ సీనియర్ ధర్మానను ఎంపీగా బరిలోకి దింపుతారా అన్నదే ఆ ఆఫర్. అంటే తండ్రీ కొడుకులకు టికెట్ ఇస్తూ సీనియర్ మంత్రిని కనుక ఎంపీగా బరిలో ఉంచితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం పది ఎమ్మెల్యే సీట్లను సులువుగా గెలుచుకోవచ్చు అన్నదే వైసీపీ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ విషయం మీద ధర్మాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు అని అంటున్నారు. ధర్మాన తన రాజకీయ జీవితం ఇక చాలు అని అనుకుంటున్నారు అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఎక్కువ సార్లు మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. దాంతో తాను ఇక పాలిటిక్స్ ని చాలించి వారసుడిని ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు.

ఇంకో వైపు చూస్తే కింజరాపు ఫ్యామిలీకి ధర్మాన ఫ్యామిలీకి తెర వెనక బంధం ఉందని అంతా అంటూంటారు. వారికి వీరూ వీరికి వారూ సాయం చేసుకుంటారని కూడా అంటూంటారు. ఆ కారణంగా రెండు సార్లు శ్రీకాకుళం ఎంపీ సీటు వైసీపీకి కాకుండా పోయిందని కూడా వైసీపీ నేతల మాటగా ఉంది.

అందుకే ఈసారి ఎవరో ఎందుకు  ధర్మాననే బరిలోకి దింపితేనే విజయం సాధిస్తామని జగన్ ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి జగన్ మాట ఫైనల్ అయితే మాత్రం ధర్మాన పోటీ చేయల్సిందే అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఫస్ట్ టైం కింజరాపు ఫ్యామిలీ వర్సెస్ ధర్మాన ముఖా ముఖీ ఫటింగ్ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఆ రాజకీయ సమరం ఏ రేంజిలో ఉంటుందో.

Similar News