నీళ్ల‌కు న‌డ‌క నేర్పుతాన‌న్నావు..టైం వ‌చ్చాక డుమ్మా కొట్టావేం కేసీఆర్‌

Update: 2019-06-16 08:24 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న మాట‌ల‌తో ఎదుటివారిని ఎలా మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తారో....త‌న వాద‌న‌కు జై కొట్టేలా ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో...ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, అలా ఆయ‌న మాట్లాడే మాట‌లే...చాలా సార్లు ఆయ‌న‌కు సెల్ఫ్ గోల్‌ గా మార‌తాయి. తాజాగా అలా మారిన ఉదంతం తెర‌మీద‌కు వ‌చ్చింది. కేసీఆర్ మాట‌లతో ఆయ‌న్నే ఇర‌కాటంలో ప‌డేశారు ఓ ఎంపీ. ఆయ‌న ఎవ‌రంటే...కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను నిజామాబాద్ ఎంపీగా ఓడించిన ధ‌ర్మ‌పురి అర‌వింద్‌.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రెండో ద‌ఫా అధికారం చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి శనివారం రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన నీతి ఆయోగ్ ఐదో పాలకమండలి సమావేశానికి హాజరైన ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు - కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు - పలువురు కేంద్ర మంత్రులు హాజ‌ర‌య్యారు. అయితే, దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్ల‌లేదు. ఈ ఎపిసోడ్‌ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా స్పందించారు. హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ఓ కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ - పరిపాలన - ప్రజా సంక్షేమాన్ని కేసీఆర్ సర్కార్ మరచిపోయిందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తోందన్నారు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులపైనే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘70 వేల టీఎంసీల నీళ్లలో సగం సముద్రం పాలవుతున్నదని కేసీఆర్ అన్నారు. కాలం చెల్లిన నీటి విధానం మీద నడుస్తోందని ఆయన అన్నారు. మూడేళ్లు నిపుణులతో చర్చించి, అధ్యయనం చేసిన తర్వాత ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టే విధానం దగ్గర ఉందని - టైం వచ్చినప్పుడు చెప్తానని అన్న ఆయన.. వర్షపు నీటి వినియోగం - కరువు నివారణ అనే అంశంపై నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి ఎందుకు రాలేదు? ఇదేనా కేసీఆర్ చిత్తశుద్ధి” అని అరవింద్ ప్రశ్నించారు.

నిజమాబాద్ లో బీజేపీ జెండా ఎగురుతుందంటూ చాలా సార్లు చెప్పానని - అదే నిజమైందని అన్నారు. దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు రాత్రింబవళ్లు కాపలా కాస్తూ అమరులవుతుంటే కేసీఆర్కు కనబడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందని - బతుకమ్మ అంటే కవితమ్మ అన్నట్టు చేశారని, అంతకు ముందు బతుకమ్మ పండుగ లేదా అని ప్రశ్నించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. అవినీతికి చోటు లేని పార్టీ బీజేపీ అని - మచ్చ లేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. అందుకే ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కట్టారన్నారు.  రాష్ట్రంలో కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని - అందుకు నిజామాబాద్ లో కవిత ఓటమే నిదర్శనమని అన్నారు.

   

Tags:    

Similar News