అమరరాజా దెబ్బ ఇద్దరికీ తగిలిందా... ?

Update: 2022-12-03 10:34 GMT
ఏపీలో పుట్టి ఇంతటి స్థాయికి విస్తరించిన అమరరాజా తన పరిశ్రమ విస్తరణకు కేంద్రంగా తెలంగాణాను ఎంచుకోవడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏకంగా పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణాలో అయిదు వేల మందికి ఉపాధిని అందించేలా అమరరాజా సంస్థ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఇది నిజంగా అధికారంలో ఉన్న వైసీపీకి దెబ్బగానే చూస్తున్నారు.

జగన్ మూడున్నరేళ్ల ఏలుబడిలో వచ్చిన పరిశ్రమల కంటే వెళ్ళినవే ఎక్కువ. తాజాగా జాకీ కంపెనీ అనంతపురం నుంచి వెళ్ళిపోయింది. ఇపుడు అమర రాజా కంపెనీ విస్తరణ పేరిట అక్కడితే వెళ్లింది. వైసీపీ సర్కార్ పారిశ్రామికంగా ఎలాంటి అభివృద్ధి చేయడంలేదు అని విపక్షాలు విమర్శలు చేయడానికి ఆస్కారం ఏర్పడింది.

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో దశాబ్దాల క్రితం అమర రాజా కంపెనీ ప్రారంభించారు. వైఎస్సార్ టైం లో ఏకంగా  450 ఎకరాల భూమిని ఈ సంస్థకు ఇచ్చారు. బ్యాటరీల తయారీలో దేశంలో నంబర్ టూ ర్యాంక్ తో ఈ సంస్థ కొనసాగుతోంది. వేలాది కోట్ల పెట్టుబడులు, అనేక మందికి ఉపాధిని ఇస్తూ అగ్రశ్రేణి సంస్థగా ఉంది. అలాంటి అమరరాజా సంస్థ విషయంలో వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఇబ్బందుల పాలు చేశారు అన్న విమర్శలు ఉన్నాయి.

అయితే వైసీపీ వారి వెర్షన్ చూస్తే పరిశ్రమలకు వందల ఎకరాల భూములు తీసుకుని వాటి పనులను చేపట్టకపోతే చట్టం ప్రకారం వెనక్కి తీసుకునే రైట్స్ ప్రభుత్వానికి ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వం అమరరాజా పేరిట వ్యర్ధంగా పడి ఉన్న రెండు వందల యాభై ఎకరాల భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తే ఆ సంస్థ కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తోంది. దానితో పాటుగా పొల్యూషన్ మరో సమస్యగా చెబుతున్నారు.

సంస్థ నుంచి వెలువడే భయంకరమైన పొల్యూషన్ కి పరిష్కారాన్ని చూపించలేదని, స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకున్నారు. ఏది ఏమైనా వైసీపీ సర్కార్ వేధింపులకు గురి చేసింది అని విపక్షాలు అన్నాయి. సంస్థ కూడా అదే ఫీల్ అయి ఉంటుంది. దాంతో అప్పట్లోనే తమిళనాడుకు అమరరాజా సంస్థ తరలిపోతోంది అన్న వార్తలు వచ్చాయి. కానీ ఇపుడు పొరుగు రాష్ట్రం తెలంగాణాలోనే సంస్థ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ చర్య వల్ల వైసీపీ సర్కార్ కి కోలుకోలేని దెబ్బ పడింది. ఇందులో రెండవ మాటకు తావు లేదు. అయితే అదే సమయంలో అమర రాజా సంస్థ అన్నది టీడీపీ ఎంపీది. గల్లా జయదేవ్ దాని యజమాని. ఆయన తన సంస్థను తెలంగాణాలో విస్తరించుకోవాలని చూడడం వల్ల తెలుగుదేశం కూడా జవాబు చెప్పుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఏపీలో రేపటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాదని తేల్చుకునేనా ఆయన ఇలా వెళ్ళిపోయారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అదే విధంగా గల్లా జయదేవ్ తాను పుట్టిన ప్రాంతానికి మేలు చేయడానికి సంస్థను విస్తరించాలి తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఏమి సందేశం ఇస్తున్నారు అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఆయన తన రాజకీయాలను ఏపీలో చేస్తున్నారు. అపుడు ఇబ్బందులు తట్టుకుంటున్నారు. మరి తన వ్యాపారం విషయంలో కూడా తట్టుకుని నిలబడాలి కదా. తన ప్రాంతానికి మేలు జరిగేలా చూడాలి కదా అన్న చర్చ వస్తోంది.

ఏపీని కేవలం ఓట్లుగా రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటారా అని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వలు శాశ్వతం కాదు, రేపటి ఎన్నికల్లో టీడీపీ రావచ్చు. అలాటపుడు తెలంగాణాలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకురాగలరా అన్న ప్రశ్నలు వేస్తున్నారు. ఒక విధంగా తెలుగుదేశానికి కూడా ఇబ్బంది కలిగించేలా అమర రాజా యాజమాన్యం చర్యలు ఉన్నాయని అంటున్నారు.

ఒక టీడీపీ ఎంపీ తన పెట్టుబడులను ఇతర రాష్ట్రాలలో పెడితే  రేపటి రోజున టీడీపీ దీని మీద ఎలా సమర్ధించుకుంటుంది అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఏది ఏమైనా అమర రాజా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News