తిరుపతి టు కాకినాడ;పవన్ లో వచ్చిన మార్పు?

Update: 2016-09-12 11:30 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన ఎక్కువగా బయటకు రారు. ఒకవేళ వచ్చారా మనసు విప్పి మాట్లాడతారు.  దూరంగా ఉన్నట్లు కనిపించినా.. ఎంతో దగ్గరన్నట్లుగా ఉండగలగటం పవన్ కు మాత్రమే సాధ్యం. ఏదైనా అంశం మీద పవన్ ఎప్పుడు.. ఎలా స్పందిస్తారో అస్సలు అర్థంకారు. కొన్ని సందర్భాల్లో నెలల తరబడి అడ్రస్ లేనట్లుగా వ్యవహరించే ఆయన..తర్వాత బయటకు వచ్చి నోరు విప్పినప్పుడు తానెంత అప్ డేటెడ్ గా ఉన్నదిచెప్పకనే చెప్పేస్తారు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లుగా వ్యవహరించే పవన్ కల్యాణ్.. స్వల్ప వ్యవధిలో రెండు బహిరంగ సభల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే.

సినిమాటిక్ గా ఏర్పాటు చేసిన తిరుపతి బహిరంగ సభలోనే.. తన తదుపరి సభ కాకినాడలో ఉంటుందని ప్రకటించిన పవన్.. తాను చెప్పినట్లే కాకినాడ సభను తాను అనుకున్నట్లే పూర్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మూడు దశల్లో పోరాటం చేస్తానని చెప్పిన పవన్.. కాకినాడ సభలో తన తదుపరి సభ ఎక్కడ ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించకపోవటం గమనార్హం. అంతేకాదు..హోదా మీద తన పోరాటంలో తర్వాతి అడుగు ఏమిటన్న ఉత్కంటను మిగులుస్తూ.. దాని గురించి ఎలాంటి ప్రకటన చేయకుండానే తన ప్రసంగాన్నిముగించారు.

ఇదిలా ఉంటే.. తిరుపతి సభకు.. కాకినాడ సభకు మధ్య ఏమైనా తేడా ఉందా?అన్న కోణం చూస్తే.. పవన్ ప్రసంగంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించటం ఖాయం. తిరుపతి సభలో కాస్త వ్యంగ్యం.. కాస్త కామెడీ.. కాస్త నవ్వులు కనిపిస్తాయి.కానీ.. కాకినాడ సభను చూస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నం. చెప్పిన సమయానికి దాదాపు నాలుగైదు నిమిషాల ముందే వేదిక మీదకు వచ్చేసిన పవన్ కల్యాణ్.. రావటం రావటమే ఆవేశంగా తన ప్రసంగాన్ని మొదలు పెట్టటం కనిపిస్తుంది.

తిరుపతి సభలోనూ ఇదే తీరును ప్రదర్శించినప్పటికీ.. ప్రసంగం మధ్యలో అప్ అండ్ డౌన్స్  చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మధ్య మధ్యలో సబ్జెక్ట్ నుంచిపక్కకు వెళ్లటం కనిపిస్తుంటుంది. పర్సనల్ విషయాల్ని ప్రస్తావించటం ఉంటుంది. కాకినాడ సభకు వచ్చేసరికి ఇలాంటివేమీ కనిపించవు. పవన్ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా ఆయన మాటలు.. హావభావాలు కనిపిస్తాయి. తిరుపతి సభలోపలుమార్లు జుట్టును వెనక్కి దువ్వుకోవటం కనిపిస్తే.. కాకినాడ సభలో మాత్రం మీసం చివర్లను తిప్పటం కనిపిస్తుంది.

తిరుపతి సభలో భావోద్వేగాల్ని కొన్ని సమయాల్లో ఎక్కువగా ప్రదర్శించినప్పటికీ.. బ్యాలెన్స్ మిస్ కాలేదన్నట్లుగా ఉంది. కానీ.. కాకినాడసభలో మాత్రం అందుకు భిన్నమైన ధోరణి కనిపిస్తుంది. హోదా లేదు.. ప్యాకేజీ మాత్రమే అంటూ కేంద్రం కుండ బద్ధలు కొట్టిన నేపథ్యంలో ఆయన హావభావాలు చాలా సీరియస్ గా ఉండటమే కాదు.. తన మాటల్ని ఆవేశపూరితంగా మాట్లాడటం కనిపిస్తుంది. తిరుపతి సభలో మాదిరి సరదా కామెంట్లు ఒక్కటంటే ఒక్కటి కూడా కాకినాడ సభలో కనిపించదు. వీలైనంత వరకూ భావోద్వేగాన్ని నింపేలా మాత్రమే పవన్ ప్రసంగం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. తిరుపతి సభకు.. కాకినాడ సభకు మధ్య పవన్ స్పీచ్ లో మార్పు స్పష్టంగా కనిపించటమేకాదు.. ప్రసంగం మధ్యలో అప్ అండ్ డౌన్స్ కూడా తగ్గినట్లుగా కనిపిస్తుంది.కాకుంటే.. కాకినాడ సభలో చాలా మాటల్ని ఆయన పుస్తకం చూసుకొని మాట్లాడటం స్పష్టంగా కనిపిస్తుంది.
Tags:    

Similar News