అఖిల‌ప్రియ‌కు ఎర్త్ త‌గిలిందండోయ్‌!

Update: 2017-06-16 14:43 GMT
క‌ర్నూలు జిల్లా టీడీపీలో రాజుకున్న నంద్యాల పంచాయ‌తీ ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా లేదు. మొన్న‌టిదాకా నంద్యాల బై ఎల‌క్ష‌న్స్‌లో టికెట్ త‌మ‌కు కావాలంటే, కాదు త‌మ‌కే కావాలంటూ భూమా - శిల్పా వ‌ర్గాలు వాదించాయి. దీనిపై పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నాన్చుడు ధోర‌ణి అవ‌లంబిస్తున్న వైనాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి.... టీడీపీకి పెద్ద షాకిస్తూ వైసీపీ గూటికి చేరారు. ఈ ఒక్క ప‌రిణామంతో టీడీపీలో నంద్యాల పంచాయ‌తీ చ‌ల్లారిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేశారు. అటు చంద్ర‌బాబు కూడా తాను అనుకున్న‌ట్లుగానే దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇస్తే స‌రిపోతుందిలే అని భావించారు. ఇక‌పై పార్టీ నేత‌లంతా క‌లిసి మెల‌సి ప‌నిచేయ‌డంతో పాటు బ్ర‌హ్మానంద‌రెడ్డిని గెలిపించి తీసుకురావాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

అయితే నంద్యాల టీడీపీలో లుక‌లుక‌లు చ‌ల్లార‌లేద‌ని - ఇంకా చాలా ఉంద‌ని తాజా ఉదంతం చెప్ప‌క‌నే చెప్పేసింది. ఆ ఉదంతం విష‌యానికి వ‌స్తే... భూమా నాగిరెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఏవీ సుబ్బారెడ్డి... మొన్న‌టిదాకా బాగానే ఉన్నా ఇప్పుడు భూమా అఖిల‌ప్రియ‌పై శివాలెత్తిపోతున్నారు. ఉన్న‌ప‌ళంగా నంద్యాల మునిసిపాలిటీలోని టీడీపీ కౌన్సిల‌ర్ల‌లో ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ కౌన్సిల‌ర్లుగా మీరు నాతో ఉంటారా?... అఖిల‌ప్రియ‌తో ఉంటారా?... అంటూ ఆయ‌న సంధించిన ప్ర‌శ్న ఇప్పుడు టీడీపీలో పెను తుఫానునే రేపింది. దీంతో అయోమ‌యంలో ప‌డ్డ కౌన్సిల‌ర్లు ఏవీ సుబ్బారెడ్డి వైపే ఉంటామంటూ చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇదిలా ఉంటే... ఏవీ సుబ్బారెడ్డి కౌన్సిల‌ర్ల‌తో భేటీ అయిన విషయం తెలుసుకున్న అఖిల‌ప్రియ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వెనువెంట‌నే ఈ విష‌యాన్ని ఆమె పార్టీ అధిష్ఠానానికి చేర‌వేశారు. వెంట‌నే లైన్లోకి వ‌చ్చిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి, జిల్లా ఇంచార్జీ మంత్రి కాల‌వ శ్రీనివాసులు ఏవీకి ఫోన్ చేశారు. ఉన్నప‌ళంగా హైద‌రాబాదు రావాల‌ని వారు ఆయ‌న‌ను కోరారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డి కూడా వారి ఆదేశాల మేర‌కు హైద‌రాబాదు బ‌య‌లుదేరిపోయారు. మ‌రోవైపు ఉన్న‌ట్టుండి నెల‌కొన్న ఈ ముస‌లం ఏ మేర న‌ష్టం చేకూరుస్తుందోన‌న్న భ‌యంతో రేపు జిల్లా నేత‌లంతా అమ‌రావ‌తికి రావాలంటూ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు.

అయినా మొన్న‌టిదాకా భూమాకు ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి... ఇప్పుడు కౌన్సిల‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ ఎందుక‌య్యార‌న్న విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. భూమా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కొంత‌కాలానికి ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లిన ఏవీ... భూమా అనుచ‌రుల్లో అత్యంత కీల‌క‌మైన నేత‌గా ఎదిగారు. భూమా నాగిరెడ్డి సొంతూరు ఆళ్ల‌గ‌డ్డ అయిన‌ప్ప‌టికీ... నంద్యాల‌లోనూ ఆయ‌న‌కు అంత‌గా ప‌ట్టు రావ‌డం వెనుక స్థానికుడైన‌ ఏవీ సుబ్బారెడ్డే కీల‌క‌లమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ నంద్యాల‌లో భూమా నాగిరెడ్డి గెలుపులో ఏవీ సుబ్బారెడ్డిదే కీల‌క భూమిక‌. భూమాకు సంబంధించి ఏ విష‌యమైనా ఏవీ సుబ్బారెడ్డికి తెలియ‌కుండా జ‌రిగే స‌మ‌స్యే లేదు. భూమా బ‌తికుండగా... ఓ కాంట్రాక్ట‌రుని బెదిరించిన‌ట్లుగా వెలుగులోకి వ‌చ్చిన ఆడియో టేపులో స‌ద‌రు కాంట్రాక్ట‌రుతో ముందుగా మాట్లాడిన వ్య‌క్తిగా ఏవీ సుబ్బారెడ్డే. తాను ఏవీ సుబ్బారెడ్డిన‌ని, భూమా నాగిరెడ్డి మాట్లాడ‌తారంటూ ఆ ఆడియో టేపులో ఏవీ స‌ద‌రు కాంట్రాక్ట‌రును ఉద్దేశించి మాట్లాడారు.

భూమా బ‌తికున్నంత కాలం ఏవీ ఆయ‌న‌ను అంటిపెట్టుకునే ఉన్నారు. భూమా నాగిరెడ్డికే కాకుండా ఆయ‌న స‌తీమ‌ణి, దివంగ‌త నేత భూమా శోభానాగిరెడ్డికి కూడా ఏవీ సుబ్బారెడ్డి చేదోడువాదోడుగా నిలిచారు. భూమా కుటుంబానికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా... ముందుగా ఏవీనే నిలిచేవారు. అస‌లు భూమా, ఏవీలు ఒకే కుటుంబానికి చెందిన‌వారా? అన్నంత‌గా వారి మ‌ధ్య బంధం ఉండేది. ఈ క్ర‌మంలో భూమా నాగిరెడ్డి, శోభ చ‌నిపోయిన త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అఖిల‌ప్రియ‌... చంద్ర‌బాబు కేబినెట్‌లో ఏకంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అదే స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌మ పెద‌నాన్న భూమా శేఖ‌ర్ రెడ్డి కుమారుడు బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు ఆమె ఏకంగా శిల్పా వ‌ర్గంతోనే ఢీకొట్టారు. ఈ క్ర‌మంలో ఆమె ఒంట‌రిగానే బ‌రిలోకి దిగి... నంద్యాల‌లో త‌న‌దైన స్పీడుతో ముంద‌కెళ్లారు. సోద‌రుడు బ్రహ్మాంద‌రెడ్డిని వెంట‌బెట్టుకుని బ‌య‌లుదేరుతున్న ఆమె... ఏవీ సుబ్బారెడ్డిని దాదాపుగా ప‌ట్టించుకోలేద‌నే వాద‌న లేక‌పోలేదు.

దీంతో అప్ప‌టిదాకా భూమా కుటుంబాన్నే న‌మ్ముకుని ఉన్న ఏవీ సుబ్బారెడ్డి గుండె ర‌గిలిపోయింద‌ని స‌మాచారం. ప‌రిస్థితి ఇలాగే ఉంటే... తాను ఏకాకిని కావ‌డ‌మే కాకుండా అస‌లు త‌న అస్తిత్వానికే ప్ర‌మాద‌మ‌న్న ఆలోచ‌న‌తోనే ఏవీ... అఖిల‌ప్రియ వ్య‌వ‌హార స‌ర‌ళిపై అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన‌ట్లు స‌మాచారం. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆయ‌న కౌన్సిల‌ర్ల‌తో భేటీ కావ‌డం, తాను వేరు కుంప‌టి పెట్టుకుంటున్న‌ట్లు చెప్ప‌డంతో అఖిల‌ప్రియ‌కు దాదాపుగా షాక్ తగిలినంత ప‌ని అయ్యింది. ఏవీ సుబ్బారెడ్డి లేకుండా ఎన్నిక‌ల‌కు వెళితే... భూమా వ‌ర్గానికి అర‌చ‌కొర ఓట్లు మాత్ర‌మే ప‌డ‌తాయ‌న్న స‌త్యాన్ని గ్ర‌హించిన మీద‌టే... ఈ వ్య‌వ‌హారాన్ని అఖిల‌ప్రియ క్ష‌ణాల్లో అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News