ల‌గ‌డ‌పాటి స‌ర్వే త‌ప్పు కానుందా?

Update: 2018-12-08 08:27 GMT
తెలంగాణ‌లో శుక్ర‌వారం ముగిసిన‌ ప్ర‌తిష్ఠాత్మ‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా ఒకేర‌క‌మైన అంచ‌నాలు వెలువ‌రించాయి. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని ముక్త కంఠంతో చెప్పాయి. ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి మాత్రం భిన్న‌మైన అంచ‌నాలు వెలువ‌రించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మి ప‌ది అటుఇటుగా 65 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. టీఆర్ ఎస్ ప‌ది అటు ఇటుగా 35 సీట్ల‌తో స‌రిపెట్టుకుంటుంద‌ని చెప్పారు.

ఇత‌ర ఎగ్జిట్ పోల్స్ అన్నీ కోడై కూస్తున్న‌వాటికి భిన్నంగా ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఉండ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ల‌గ‌డ‌పాటి గ‌తంలో చెప్పిన స‌ర్వే ఫ‌లితాలు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌య్యాయి? ఇప్పుడు నిజ‌మ‌య్యే అవ‌కాశాలెంత‌? అని అంతా చ‌ర్చించుకుంటున్నారు. అయితే - ల‌గ‌డ‌పాటి పప్పులో కాలేశార‌ని - ఈ ద‌ఫా ఆయ‌న స‌ర్వే త‌ప్ప‌య్యే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. గ‌తంలోనూ ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాలు త‌ల‌కిందులైన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

ఈ ఏడాది మేలో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. అక్క‌డ బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ల‌గ‌డ‌పాటి జోస్యం చెప్పారు. ఆ అంచ‌నా త‌ప్పింది. బీజేపీ మెజారిటీ సాధించ‌లేదు. జ‌న‌తాద‌ళ్‌(ఎస్‌) - కాంగ్రెస్ క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. త‌మిళ‌నాడు 2016లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ల‌గ‌డ‌పాటి ప‌ప్పులో కాలేశారు. జ‌య‌ల‌లిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ఓడిపోతుంద‌ని - క‌రుణానిధి పార్టీ డీఎంకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని చెప్పారు. అది కూడా జ‌ర‌గ‌లేదు. అన్నా డీఎంకే స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించింది.

ఇక 2014లో తెలంగాణ ఎన్నిక‌ల విష‌యంలోనూ ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్ లెక్క‌లు బ‌య‌ట‌పెట్టాడు. అప్ప‌ట్లో టీడీపీ-బీజేపీ కూట‌మి - టీఆర్ ఎస్ సాధించే స్థానాల విష‌యంలో ల‌గ‌డ‌పాటి లెక్క కాస్త అటు ఇటుగా స‌రిపోయింది. కాంగ్రెస్ విష‌యంలోనే లెక్క త‌ప్పింది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి 18-22 సీట్లు వస్తాయని ల‌గ‌డ‌పాటి ఫ్లాష్‌ టీం అంచనా వేస్తే.. 20 సీట్లు వచ్చాయి. టీఆర్ ఎస్‌ కు 50-60 సీట్లు వస్తాయని అంచనా వేస్తే.. వాస్తవంగా 63 స్థానాల్లో కారు గెలిచింది. కాంగ్రెస్‌ కు 30-40 సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేశారు. కానీ - 20 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. 7 నుంచి 9 స్థానాల్లో ఇతరులు గెలుస్తారని అంచనా వేస్తే.. ఏకంగా 15 మంది గెలిచారు.

గ‌త ఫ‌లితాల‌న్నీ చూస్తే లగ‌డ‌పాటి లెక్క మ‌ళ్లీ త‌ప్పే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అంటే తెలంగాణ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఏర్ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వారు సూచిస్తున్నారు. మ‌రి ల‌గ‌డ‌పాటి అంచ‌నాలు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో తెలుసుకోవాలంటే మ‌రో రెండు రోజులు వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News