ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త‌: కేంద్ంపై ఒత్తిడి పెంచిన జ‌గ‌న్‌

Update: 2021-07-23 14:30 GMT
వైసీపీ త‌ర‌ఫున గెలిచి.. ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పైనే కాలుదువ్వుతున్న ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు ముఖ్య‌మంత్రి వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో వైసీపీ ఎంపీలు.. రాజ్య‌స‌భ‌లో తీవ్ర ర‌గ‌డ సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. చైర్మ‌న్ పోడియంను సైతం చుట్టుముడుతున్న ఎంపీలు.. కార్య‌కలాపాల‌కు తీవ్ర విఘాతం క‌లిగిస్తున్నారు. ఈ విష‌యాన్ని బీజేపీ అగ్ర‌నాయ‌కులు గ‌మ‌నిస్తున్నారు. అత్యంత కీల‌కమైన స‌మ‌యంలోనూ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో వైసీపీ ఎంపీలు.. వెన‌క్కిత‌గ్గ‌కుండా త‌మ‌నిర‌స‌న వ్య‌క్తం చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

పోల‌వ‌రం, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, ఏపీపై కేంద్రం చూపుతున్న వివ‌క్ష‌.. వంటి అంశాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్న ఎంపీలు.. రాజ్య‌స‌భ చైర్మ‌న్ పోడియంను సైతం చుట్టుముట్టి.. ఆందోళ‌న చేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి వైసీపీ ఎంపీల హడావుడి చూసిన వారు కొంద‌రు.. ఆదిలో.. ఇదంతా కేంద్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగావైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని భావించారు. ఎందుకంటే.. పెగాస‌స్ స్పైవేర్‌పై ఇత‌ర ప‌క్షాలు నిల‌దీస్తున్న స‌మ‌యంలో పార్ల‌మెంటులో ఆ విష‌యాన్ని పెద్ద‌గా రెయిజ్ కాకుండా.. వైసీపీ ఎంపీలు వ్యూహాత్మ‌కంగా రాష్ట్ర అంశాల‌ను లేవనెత్తి స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని భావించారు. కానీ, ఇప్పుడు ఈ విష‌యాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే.. వైసీపీ వ్యూహం వేరే ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కొన్నాళ్లుగా న‌లుగుతున్న ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారంలో అత్య‌వ‌స‌రంగా ఆయ‌న‌పై వేటు వేయించ‌డమే ఈ దూకుడు వెనుక వైసీపీ ఎంపీల ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఎంపీ ర‌ఘురామ‌పై.. వేటు వేయాలని కోరుతూ.. స్పీక‌ర్ ఓం బిర్లాకు వైసీపీ అభ్య‌ర్థ‌న చేసి ఏడాది పైగానే అయింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో చేతులు క‌లిపిన ఆయ‌న.. ఏపీ పాల‌న‌పైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా హ‌ద్దులు మీరి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. ఆయ‌న‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో అటు బీజేపీ అధిష్టానం కానీ, స్పీక‌ర్‌కానీ.. స్పందించ‌లేదు. పైగా దీనిని నానుస్తున్నార‌నే వాద‌న వైసీపీ లేవ‌నెత్తుతోంది.


ఈ క్ర‌మంలోనే ఎంపీ ర‌ఘురామ‌పై వేటు వేయించే వ‌ర‌కు ఎంపీలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. పార్ల‌మెంటులో కార్య‌క‌లాపాల ను స్తంభింప‌చేస్తున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదిలావుంటే..  బీజేపీ నేత‌లు.. వైసీపీ వ్యూహాన్ని అర్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీ ఎంపీల‌ను  కూల్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీల‌తో కొంద‌రు బీజేపీ పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది ఈ క్ర‌మంలో ``ప్ర‌త్యేక హోదాను విస్మ‌రించారు. ఎంపీపై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కూడా నానుస్తున్నారు. కేంద్రం చేస్తున్న ఈ వ్య‌వ‌హారంతో.. మేం త‌లెత్తుకోలేక పోతున్నాం`` అని ఎంపీలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తెలుస్తోంది.  

దీంతో కేంద్రంలోని బీజేపీ అధినాయ‌క‌త్వం.. ఈ విష‌యంపై చ‌ర్చించేందుకుఏకంగా సీఎం జ‌గ‌న్‌ను ఢిల్లీకి ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న సోమ‌వారం, లేదా మంగ‌ళ‌వారాల్లో ఢిల్లీకి వెళ్లి.. త‌మ డిమాండ్ల‌ను కేంద్రం ముందు ఉంచ‌నున్న‌ట్టు స‌మాచారం.  జ‌గ‌న్‌కు-బీజేపీ నేత‌ల‌కు మ‌ధ్య చ‌ర్చ‌లు స‌ఫ‌లీకృత‌మైతే.. ఈ నెల చివ‌ర‌లోగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News