ఓటమి భయం.. గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యే నగదు కవర్ల పంపిణీ!?

Update: 2023-02-04 17:00 GMT
16 అసెంబ్లీ స్థానాలున్న కృష్ణా జిల్లాలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి ఆయా పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తాము గెలుపొందడానికి అన్ని రకాల ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారని టాక్‌ నడుస్తోంది.

ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ప్రజలకు నగదు కవర్లు పంపిణీ చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత కొద్ది కాలానికే వైసీపీని అనుబంధంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మోహన్‌ పోటీ చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ప్రకటించింది.

మరోవైపు వల్లభనేని వంశీ రాకను గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ బోర్డు సభ్యుడు దుట్టా రామచంద్రరావు, కృష్ణ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లిద్దరూ ఒక వర్గంగా కొనసాగుతున్నారు. వంశీకి సహకరించేది లేదని ఇప్పటికే అధిష్టానానికి సైతం తేల్చిచెప్పారు.

ఇటీవల దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ మండిపడ్డ సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీని ఓడించడానికి కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని చూస్తున్న ఇందుకు ఇప్పటి నుంచే నగదు పంపిణీకి తెర తీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్‌ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో సాయం అడిగిన వారికి, అడగని వారికి నగదు కవర్లు చేతిలో పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఒక్కో కవరులో రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేలు ఉంటున్నాయని ప్రధాన పత్రిక తన కథనంలో పేర్కొంది.

స్థానికుల జీవన పరిస్థితులు, వారి ఇబ్బందులను బట్టి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సందర్భాన్ని బట్టి తన అనుచరులకు ఏ కవరు ఇవ్వాలనేది సైగ చేస్తున్నారని.. దీని కోసం ఇద్దరు అనుచరులు నిరంతరం ఆయన వెన్నంటే ఉంటున్నారని ప్రధాన పత్రిక కథనం ప్రచురించింది.

వంశీ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మొదలు ఈ నగదు పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోందని ఆ పత్రిక వెల్లడించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముందస్తుగానే వంశీ ఈ విధంగా నగదు పంచుతున్నారన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.  హనుమాన్‌ జంక్షన్‌ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో గడప గడపకు తిరుగుతూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నగదు కవర్లు అందించారని ఆ పత్రిక పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News