డీకే అరుణ‌ - రేవంత్ రెడ్డి...అస‌లు స్కెచ్చేంటి

Update: 2019-02-18 10:31 GMT
పార్ల‌మెంటు ఎన్నిక‌లు సమీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ లో కొత్త‌ రాజ‌కీయం మొద‌లైంది. తాజాగా సీనియ‌ర్ నేత - మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డికి ఫైర్‌ బ్రాండ్ నాయ‌కురాలు డీకే అరుణ - పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎత్తుగ‌డ‌లు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ చేతిలో ఓడిపోయిన అరుణ ఎంపీ సీట్ పై కన్నేశారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి త‌న‌దైన శైలిలో పావులు కదుపుతున్నార‌ని - ఇందులో భాగంగా విందు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే, ఇదే సీటుపై పార్టీ నేత రేవంత్ రెడ్డి సైతం క‌న్నేశారు. దీంతో పార్టీలో మ‌రో జిల్లా పోరు త‌ప్ప‌దా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి మహబూబ్‌ నగర్ జిల్లాలో రెండు లోక్‌ సభ స్థానాలుండగా..వీటిలో నాగర్ కర్నూల్ సీట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. జ‌న‌ర‌ల్ సీటు అయిన మహబూబ్‌ నగర్ సీటు నుంచి గత ఎన్నికల్లో ఆయన టీఆర్ ఎస్ నేత జితేందర్‌ రెడ్డి అప్ప‌టి కేంద్ర‌మంత్రి జైపాల్ రెడ్డి గెలుపొందారు. తాజాగా పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో జైపాల్ రెడ్డి మళ్లీ పోటీకి ప్ర‌యత్నిస్తున్నారు. అయితే, ఈసారి ఆ సీటుపై డీకె అరుణ క‌న్నువేసిన‌ట్లు స‌మాచారం. మహబూబ్‌ నగర్ లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిన డీకే అరుణ ఇటీవల పార్టీ సీనియర్ నేతలను విందు సమావేశానికి ఆహ్వానించారు. హైదరాబాదులోని గండిపేట వద్ద గల ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పార్టీ సీనియ‌ర్లు జానారెడ్డి - రేవంత్ రెడ్డి - మల్లుభట్టి విక్రమార్క - ఇంకా పలువురు సీనియర్ నేతలు హాజ‌ర‌య్యారు.

అయితే, రేవంత్ రెడ్డి సైతం ఈ సీటుపై త‌న క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. రేవంత్ రెడ్డితో దోస్తీ చేసి - జైపాల్ రెడ్డికి చెక్ పెట్టడం ద్వారా మహబూబ్ నగర్ టికెట్ సాధించాలనే పట్టుదలతో డీకె అరుణ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ ప్ర‌య‌త్నాల‌కు మ‌ద్ద‌తిస్తున్న రేవంత్ రెడ్డి తాను సైతం సొంతంగా టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే,  ఈ ఇద్ద‌రు నేత‌ల్లో ఎవ‌రూ కూడా ప్ర‌స్తుతం స్వీక‌రిస్తున్న ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌లో త‌మ ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తూ ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో హైక‌మాండ్ ఎవ‌రికి టికెట్ ఇవ్వ‌నుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News