కాఫీడే సిద్ధార్థ అదృశ్యం...డీకే శివ‌కుమార్ క‌ల‌క‌లం

Update: 2019-07-30 14:30 GMT
సుప్ర‌సిద్ధ వ్యాపార‌వేత్త‌, కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వీజీ సిద్ధార్థ అదృశ్య‌మైన ఉదంత‌లో కీల‌క ప‌రిణామాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. సోమ‌వారం బెంగుళూరులో ఇంటి నుంచి వెళ్లిన సిద్ధార్ధ మంగుళూరులోని నేత్రావ‌తి న‌ది వ‌ద్ద క‌నిపించ‌కుండాపోయిన‌ట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేశారు. మంగుళూరు పోలీసు క‌మిష‌నర్‌ సందీప్ పాటిల్ ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ, క‌ర్నాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు అదృశ్య‌మైన ఉదంతంలో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. మ‌రోవైపు ఈ ఎపిసోడ్‌ లో కాంగ్రెస్ నేత డీకే శివ‌కుమార్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

పోలీస్ క‌మిష‌న‌ర్ సందీప్ పాటిల్ మాట‌ల ప్ర‌కారం స‌క‌లేశ్‌ పూర్ వెళ్తున్న‌ట్లు ఇంట్లో చెప్పిన సిద్ధార్థ‌.. త‌న డ్రైవ‌ర్‌ తో క‌లిసి మంగుళూర్ వెళ్లాడు.  బెంగళూరు నుంచి సఖిలేష్‌ పూర్ బ‌య‌ల్దేరి కొంత దూరం  సిద్ధార్థ మనసు మార్చుకొని నేత్రావ‌తి న‌ది వ‌ద్ద‌కు చేరుకున్న త‌ర్వాత కారు ఆపాల‌ని కోరారు. అనంత‌రం న‌దిప‌వైపు న‌డుచుకుంటూ వెళ్లి అదృశ్య‌మ‌య్యారు. ప్ర‌స్తుతం నేత్రావ‌తి న‌దిలో బోట్ల‌తో సిద్ధార్థ కోసం వెతుకుతున్నారు. స్థానిక జాల‌ర్లు కూడా ప‌డ‌వ‌ల్లో గాలింపు చేప‌ట్టారు. డాగ్‌ స్క్వాడ్‌‌ తో బ్రిడ్జి వద్దకు మంగళూరు పోలీసులు వెళ్లారు. డాగ్‌ స్క్వాడ్ సెర్చ్ డాగ్ బ్రిడ్జి మధ్యలోకి వెళ్లి ఆగడంతో అక్కడ నుంచి సిద్ధార్థ దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట‌ర్స్‌ కు ఆయ‌న ఓ లేఖ రాశాడు. ఆ లేఖ‌లో అత‌ను భావోద్వేగాన్ని వ్య‌క్తం చేశాడు. లాభాలు సృష్టించే వ్యాపార న‌మూనాను త‌యారు చేయ‌లేక‌పోయినందుకు చింతిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఎంత క‌ష్ట‌ప‌డినా.. లాభాలు రాలేక‌పోయాయ‌న్నాడు. ``నా సాయ‌శ‌క్తులా బిజినెస్ అభివృద్ధి కోసం ప్ర‌య‌త్నించాను, కానీ నాపై న‌మ్మ‌కం ఉంచిన వారిని ఆదుకోలేక‌పోతున్నాను, ఇన్నాళ్లూ ఆ ఒత్తిడి తీసుకుని ప‌నిచేశా, కానీ ఇప్పుడు ఆ ఒత్తిడి త‌ట్టుకోలేను, షేర్ల‌ను కొనుగోలు చేయాల‌ని ఓ పార్ట్న‌ర్ వ‌త్తిడి తెస్తున్నాడు` అని సిద్దార్థ త‌న లేఖ‌లో తెలిపాడు. ప్ర‌తి ఆర్థిక లావాదేవీ బాధ్య‌త త‌న‌దే అని బోర్డ్ ఆఫ్ డైర‌క్ట‌ర్ల‌కు రాసిన లేఖ‌లో సిద్ధార్థ పేర్కొన్నాడు. చ‌ట్టం త‌న‌నే దోషిగా చిత్రీక‌రించాల‌ని చెప్పాడు.

ఇదిలాఉండ‌గా, సిద్దార్థ సంత‌కంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న ప‌లు పత్రాల్లో చేసిన సంతకం, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న లేఖలోని సంతకంలో తేడా ఉందని చ‌ర్చ జ‌రుగుతోంది. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, బయోకాన్ చీఫ్ కిరణ్ మంజూదార్ షా సైతం సిద్దార్థ అదృశ్యం అయిన విషయంలో, ఆయన సంతకం విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తనకు ఫోన్ చేసిన సమయంలో సిద్దార్థ బాగానే మాట్లాడారని, ఆయన మాటల్లో ఆందోళన లేదని డీకే. శివకుమార్ అంటున్నారు. ప్ర‌భుత్వం సిద్ధార్థ అదృశ్యం విష‌యంలో నిజానిజాలు వెలికి తీయాల‌ని కోరారు.

ఇదిలాఉండ‌గా, మంగుళూర్ క‌మిష‌నర్ పాటిల్ బెంగుళూరు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న ఎస్ ఎం కృష్ణ ఇంటికి వెళ్లి వివ‌రాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.సిద్ధార్థ భార్య‌, ఇత‌ర కుటుంబ‌స‌భ్య‌ల‌తో మాట్లాడారు. సిద్ధార్థ  అదృశ్యం వెనుక అస‌లు నిజాలు వెలికితీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు.

   
   
   

Tags:    

Similar News