హైడ్రా వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆక్రమాల తొలగింపుపై ఆగ్రహం!

దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి సముదాయాలను కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు.

Update: 2025-01-23 09:08 GMT

హైదరాబాదు నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు తొలగింపుపై హైడ్రా జోరుగా ముందుకు వెళుతోంది. అయితే కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు నుంచి హైడ్రా అధికారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా చింతల్ బస్తీలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపపై కైరుతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి సముదాయాలను కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు.

సీఎం వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు. అయినప్పటికీ అధికారులు ఎమ్మెల్యే దానం నాగేందర్ మాటలను వినకపోవడం గమనార్హం. తాము ప్రజలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని.. మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే ఎలా అని దానం నాగేందర్ అధికారులను ప్రశ్నించారు. అయినప్పటికీ అధికారులు ముందుకే వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. బతుకుతెరువు కోసం నగరానికి వచ్చి తమ వారిపై దౌర్జన్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. తన పదవి పోయినా పరవాలేదు కానీ కూల్చివేతలను అడ్డుకొని తీరతానని హెచ్చరించారు. కొందరు అధికారులు చేస్తున్న ఈ తరహా పనులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటి జోలికి వెళ్లకుండా అధికారులు చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఈ తరహా చర్యలు ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను సీఎంతో మాట్లాడుకుంటానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంత చెప్పినప్పటికీ అధికారులు వినకుండా కూల్చివేతలు చేసేందుకు ముందుకు వెళ్లడంతో ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతానంటూ ఎమ్మెల్యే దానం హెచ్చరించి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ వచ్చి పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది. పేదల డబ్బాలను నిర్దాక్షిణ్యంగా అధికారులు ధ్వంసం చేస్తున్నారని, తొలగించుకునేందుకు వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు వారికి కొంత సమయం ఇచ్చారు. ఆ సమయంలో కొందరు తమ డబ్బాలను తొలగించుకోగా.. సమయం ముగిసిన అనంతరం మిగిలిన వాటిని పోలీసులు కూల్చివేయించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలోనూ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇలానే హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే ఆక్రమణలను తొలగించేందుకు ఉన్నత స్థాయి అధికారులు బృందం పక్క స్కెచ్ తో వ్యవహరించింది. జిహెచ్ఎంసి, శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగాలకు చెందిన అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఖైరతాబాద్ షాధన్ కళాశాల ఎదురుగా ఉన్న చింతల బస్తి ప్రధాన రహదారి నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 రహదారి వరకు దాదాపు కిలోమీటర్ మేర ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News