అటవీ భూమల కబ్జా ర్యాంకులు.. తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో?
దేశ వ్యాప్తంగా ఉన్న అటవీ భూములు కబ్జాకు గురవుతున్న అంశంపై కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.;

దేశ వ్యాప్తంగా ఉన్న అటవీ భూములు కబ్జాకు గురవుతున్న అంశంపై కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రోటీన్ కు భిన్నంగా ఈసారి రాష్ట్రాల వారీగా కబ్జాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసేలా ర్యాంకింగ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మొత్తం 25 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 13 వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూములు అక్రమణలకు గురైనట్లుగా తేల్చారు. కబ్జా చేసిన భూమి సైజ్ ఇట్టే అర్థమయ్యేందుకు వీలుగా ఒక పోలికతో చెప్పే ప్రయత్నం చేసింది.
దేశవ్యాప్తంగా కబ్జా అయిన అటవీ భూముల సైజు ఢిల్లీ.. సిక్కిం.. గోవాల భౌగోలిక విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్న విషయాన్ని వెల్లడించింది. దేశం మొత్తమ్మీదా మధ్యప్రదేశ్ లో భారీ ఎత్తున అటవీ భూముల అక్రమణ జరిగిందని.. అక్కడ 5460 చదరపు కిలోమీటర్ల మేర భూములు అక్రమణలకు గురైనట్లుగా పేర్కొంది. ఆ తర్వాత స్థానంలో ఈశాన్య రాష్ట్రమైన అసోం నిలిచింది. ఇక్కడ 3620 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి కబ్జా అయ్యింది. ఏపీ.. మహారాష్ట్ర.. ఒడిశా.. పుదుచ్చేరి.. పంజాబ్.. తమిళనాడు.. త్రిపుర.. ఉత్తరాఖండ్.. ఉత్తరప్రదేశ్.. సిక్కిం.. రాష్ట్రాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో 133 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కబ్జా అయినట్లుగా పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్ లో ఏపీ స్థానం 12గా తేల్చారు. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ జాబితాలోనే లేదు. అలా అని కబ్జా కాలేదన్న సంతోషం వద్దు. ఎందుకంటే.. తమ రాష్ట్రాలో కబ్జా అయిన అటవీ ప్రాంతం ఎంతన్న వివరాల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోవటం గమనార్హం. తెలంగాణ మాదిరి వివరాలు అందించని రాష్ట్రాల జాబితాలో మరో పది ఉన్నాయి. మొత్తంగా కబ్జా చేసిన అటవీ ప్రాంతంలో 409 చదరపు కిలోమీటర్ల మేర భూమిని మాత్రం స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు.