ఇదేందయ్యా ఇది.. న్యూ ఇయర్ ఇలా కూడా జరుపుకుంటారా?

Update: 2021-12-30 10:30 GMT
న్యూఇయర్ రాబోతుంది అనగానే పది రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు ఎవరి గ్యాంగ్ తో వారు వారికి తగిన రేంజ్ లో ఏర్పాట్లు ఎంజాయ్ చేస్తారు. ఏటికేడు భిన్నంగా జరపుకోవాలని తహతహలాడుతారు. అయితే నిజానికి మన తెలుగు వాళ్లకు కొత్త ఏడాది అంటే ఉగాది. మనకు వచ్చే తొలి పండుగ కూడా అదే. తెలుగు నూతన సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకునేవారు. అప్పట్లో పనుల్లోనూ ఉగాదికే ప్రాధాన్యం ఉండేది. కానీ కాలక్రమేణా బ్రిటీషు వారి అలవాట్లలో కొన్నింటిని మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం. ఇక న్యూఇయర్ వేడుకలు కూడా గ్రాండ్ గా జరుపుకుంటున్నాం. జనవరి 1న కొందరు గుడికి వెళ్తారు. మరికొందరు ఏదైనా స్పెషల్ ప్లేస్ కి వెళ్తారు. మంచి వంటకాలు చేసుకొని ఆరగిస్తారు. ఇలా ఎవరికి నచ్చినట్లు గడిచిన ఏడాదికి బై బై చెబుతూ... నూతన ఏడాదికి స్వాగతం పలుకుతారు. ప్రపంచవ్యాప్తంగా ఒకేలా జరుపుకోరు. ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారు. అది కూడా అందరూ జనవరి 1నే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోరు. అయితే కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే వెరైటీ న్యూఇయర్ వేడుకలపై ప్రత్యేక కథనం.


ఆఫ్రికా దేశంలో ఉండే జీమా తెగకు చెందిన వారు న్యూఇయర్ వేడుకలను తమదైన స్టయిల్ లో జరుపుకుంటారు. పిల్లాపెద్దా అంతా కూడా పక్షం రోజుల పాటు ఈ ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటారు. వారి ప్రధాన వృత్తి అయిన వ్యవసాయాన్ని కూడా పక్కనబెట్టేస్తారు. ఆ 15 రోజులు వీధుల్లో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. జీమా భాష మాట్లాడే వీరిని అప్పోలు అని కూడా అంటారు. ఇకపోతే ఈ నూతన సంవత్సరాన్ని అభిస్సా పేరుగా పిలుస్తారు. అంటే ప్రశ్నించుకోవడం. పాత ఏడాదిలో ఏం చేశామో మనకు మనమే ప్రశ్నించుకోవాలి. వచ్చే ఏడాది ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఇలా ఈ వేడుకలను అందరూ కలిసి ఆనందోత్సహాల నడుమ జరుపుకుంటారు. అంతేకాకుండా ఆడ వారు మగవారి దుస్తులు, మగవారు ఆడవారిలో తయారవతారు. అక్కడ ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థే అమల్లో ఉంది. కాబట్టి ఆడవారు చెప్పినట్లే పురుషులు వినాల్సిందే.


వేరే దేశాల్లో ఈ కొత్త సంవత్సర వేడుకలను వింతంగా జరుపుకుంటారు. న్యూఇయర్ రోజున ఐర్లాండ్ లో బ్రెడ్డును గోడలకేసి కొడుతారు. కిటికీలు తీసే ఉంచుతారు. గాలి దిశను బట్టి ఏడాది ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. జోహన్స్ బర్గ్ లో కిటికీలో నుంచి కుర్చీలను విసిరిగొడతారు. ఇక స్కాట్ లాండ్ లో ఫైర్ బాల్స్ మధ్య పరిగెడతారు. సైబీరియాలో మొక్కను చేతిలో పట్టుకొని చల్లని నీటిలోకి దూకుతారు. డెన్మార్క్ లో కుర్చీ మీది నుంచి దూకుతారు. ఇక పింగాణీ పాత్రలను పగలగొట్టి... వాటిని బయటపడేస్తారు. అలా చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుందట. థాయ్ లాండ్ లో నీటిని బకెట్లతో చల్లుకుంటారు. అంతేకాకుండా బూడిదను రాసుకుంటారు. ఇక రుమేనియాలో ఆవులతో కాలక్షేపం చేస్తారు. మరికొన్ని ఆఫ్రికా దేశాల్లో ఇంట్లో ఉన్న పాత సామాగ్రిని బయట పడేస్తారు. బ్రెజిల్ లో తృణ ధాన్యాలతో తయారు చేసిన స్పెషల్ సూప్ ను సేవిస్తారు.మెక్సికో ప్రజలు పచ్చని ద్రాక్షా తింటారు. గంటకో ద్రాక్ష చొప్పున అర్ధరాత్రి వరకు తింటే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం.


సిసిలీలో కొన్ని వంటలను ఆరోజున తినరు. కొత్త సంవత్సరం రోజు నూడిల్స్ తింటే చెడు జరుగుతుందని నమ్ముతారు. ఇకపోతే బొలివియాలో కొన్ని బొమ్మలను గుమ్మాలకు వేలాడదీస్తారు. చెక్కలతో ప్రత్యకమైన డాల్స్ తయారు చేసి అమ్ముతారు. ఇక జర్మనీ వాసులు సీసంతో తమ భవిష్యత్ చూసుకుంటారు. అంటే మనం పంచాగం చూసినట్లు అన్నమాట. సీసం కరిగించి చల్లటి నీటిలో వేసి వచ్చిన ఆకారాన్ని బట్టి కొత్త ఏడాదిలో ఏం జరుగుతుందో అంచనా వేస్తారు. ఇకపోతే రష్యాలో రెండు సార్లు న్యూఇయర్ వేడుకలు ఉంటాయి. జనవరి 1, జనవరి 14న ఉత్సవాలు చేసుకుంటారు. జూలియర్ క్యాలెండర్ ప్రకారం రెండువారాల గ్యాపులో రెండు సార్లు న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటారు. క్యూబాలో కామదహనం వంటి కార్యక్రమం నిర్వహిస్తారు. మనిషి ఆకారాన్ని పోలిన బొమ్మను డిసెంబర్ 31న దహనం చేస్తారు. ఇక టర్కీలో అయితే కచ్చితంగా ఎర్రటి లోదుస్తులను వేసుకుంటారు. చీలి దేశంలో కొందరు... శ్మశానంలో తమ వారి సమాధి దగ్గరకి వెళ్లి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. సౌదీ అరెబియా, కొరియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం వంటి దేశాల్లో జనవరి 1 ఈ వేడుకలు అసలే ఉండవు. అక్కడి క్యాలెండర్ ను బట్టి ప్రత్యేకంగా జరుపుకుంటారు.




Tags:    

Similar News